telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : .. రోహిత్ సెంచరీ.. మరో విజయం దిశగా భారత్..

rohit century on bangladesh in world cup match

నేడు ప్రపంచ కప్ లో భాగంగా భారత్-బంగ్లాదేశ్‌ లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తిరుగులేని రికార్డులు సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో నాలుగో శతకం బాదేశాడు. 92 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అందులో 7 బౌండరీలు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. శతకం ముందు విధ్వంసకరంగా మారిన హిట్‌మ్యాన్‌ వెంటనే ఔటవ్వడం అందరినీ నిరాశపరిచింది. అతడి నుంచి అభిమానులు మరో ద్విశతకం కోరుకున్నారు! ఈ మ్యాచ్‌లో అందుకు అవకాశం ఉన్నా సౌమ్య సర్కార్‌ అతడి ఆశలు నెరవేరనివ్వలేదు. శతకం ద్వారా రోహిత్‌ ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా మారాడు.

ప్రపంచ కప్ లో హిట్‌మ్యాన్‌ కొన్ని రికార్డులు :

* రోహిత్‌కు ఈ ప్రపంచకప్‌లో ఇది నాలుగో శతకం. కుమార సంగక్కర 2015 ప్రపంచకప్‌లో సాధించిన నాలుగు శతకాల రికార్డును అతడు సమం చేశాడు.
* ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు సాధించింది సచిన్‌. 6 చేశాడు. సంగక్కర 5 చేశాడు. హిట్‌మ్యాన్‌ మిగతా మ్యాచుల్లోనూ సెంచరీలు బాదేస్తే వీరిద్దరి రికార్డులు బద్దలు కావడం ఖాయం.
* వన్డేల్లో రోహిత్‌కు ఇది 26వ శతకం. సచిన్‌ (49), కోహ్లీ (41), పాంటింగ్‌ (30), జయసూర్య (28), హషీమ్‌ ఆమ్లా (27) అతడికన్నా ముందున్నారు.
* ప్రపంచకప్పుల్లో భారత్‌ తరఫున రోహిత్‌, రాహుల్‌ అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లాపై 176 పరుగులు సాధించారు. 2015లో ఐర్లాండ్‌పై రోహిత్‌-ధావన్‌ 174 రికార్డును అధిగమించారు. రెండుసార్లు అత్యధిక భాగస్వామ్యాల్లో కీలకపాత్ర హిట్‌మ్యాన్‌దే కావడం గమనార్హం.
* ప్రపంచకప్‌లో అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 5 శతకాలు బాదింది రోహిత్‌ మాత్రమే. కేవలం 15 ఇన్నింగ్సుల్లోనే చేశాడు. ఇందుకోసం సంగక్కర 35, రికీ పాంటింగ్‌ 42 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. 6 శతకాల కోసం సచిన్‌ 44 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
* ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడు రోహితే. 7 మ్యాచుల్లో 90.66 సగటుతో 544 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 96 పైనే ఉండటం గమనార్హం.
* బంగ్లా మ్యాచ్‌లో రోహిత్‌ 5 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో తన సిక్సర్ల సంఖ్యను 230కి పెంచాడు. భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదింది అతడే. ధోనీ 228 సిక్సర్లు తర్వాతి స్థానంలో ఉన్నాడు. షాహిది అఫ్రిది (351), క్రిస్‌గేల్‌ (326), జయసూర్య (270) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

Related posts