telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం… బాలకృష్ణ వ్యాఖ్యలపై సి.కళ్యాణ్

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. షూటింగులు మొదలు పెట్టే విషయంపై సీఎం కేసీఆర్‌ను సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కలిసి చర్చించిన విషయం తనకు తెలీదని బాలకృష్ణ అన్నారు. ఈ సమావేశానికి రావాలని తనను ఏ ఒక్కరూ పిలవలేదన్న బాలయ్య.. తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కూర్చుని హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ స్పందించారు. తెలుగు చలన చిత్ర సీమలో బాలకృష్ణది ప్రత్యేక స్థానమని, ఆయనకు ఇచ్చే గౌరవం ఎప్పుడూ ఇస్తామన్నారు. గత కొన్ని రోజులుగా చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలను బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లానని కల్యాణ్ చెప్పారు. సీఎం కేసీఆర్‌ను సినీ ప్రముఖులు కలిసిన మీటింగ్‌కి బాలకృష్ణని పిలవాల్సిన బాధ్యత ‘మా’ అసోసియేషన్‌దేనన్నారు. చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి మంత్రి తలసాని లీడ్‌ తీసుకున్నారని చెప్పారు. సినిమా రంగంలో విభేదాలు లేవని, అంతా ఒక్కటేనని సీ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘‘నిన్నటి దాకా దాసరి నారాయణ రావుగారు భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి భుజాన వేసుకోవచ్చు. చిరంజీవిగారి ఫేస్ వ్యాల్యూ పనికొస్తుందని ఆయనను మేం అడిగాం. అలాగే నాగార్జున గారు వచ్చారు. మీకు అవసరమైతే చెప్పండి నేను వస్తాను అని బాలకృష్ణగారు అన్నారు. ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం. ఎవరితో పని జరుగుతుందంటే వాళ్లను తీసుకెళ్తాం. షూటింగ్‌లకు ఇబ్బందులు లేకుండా పని జరగడం మాకు ముఖ్యం. మేము ఏ పార్టీలకు సంబంధించిన వాళ్లం కాదు. సినిమా వాళ్లం.’’ అని కల్యాణ్ తెలిపారు. బాలయ్య ఆర్టిస్ట్ మాత్రమేనా?? ఇండస్ట్రీ పెద్దగా చూడటం లేదా?? అంటే.. చాలా విషయాల్లో మేం బాలకృష్ణ గారిని ముందు పెట్టి వెళ్లాం. కాని ఇక్కడ సమస్య షూటింగ్‌లకు సంబంధించి అది నిర్మాతలు చేయాల్సిన పని. ఆర్టిస్ట్‌లు తరువాత వస్తారు. తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు లీడ్ చేసేవారు. ఆయన చిన్న మాట చెబితే పని అయిపోయేది. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. అంతేతప్ప మాలో విభేదాలు అనేవి లేవు. ఏది ఏమైనా అందర్నీ కలుపుకునే ముందుకు వెళ్లబోతున్నాం’ అని అన్నారు సి కళ్యాణ్.

Related posts