telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

7 లక్షల పెన్షన్లలో కోత…!?

Pension

సామాజిక పింఛన్లలో చేపడుతున్న చేర్పులు, కోతల విషయంలో జగన్‌ ప్రభుత్వం వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. సామాజిక పింఛన్లు పొందేవారి వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. లబ్ధిదారులను పెంచింది. కొత్తగా ఆరు లక్షలమందిని ఈ పథకంలో చేర్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, కొత్తవారికి పింఛను ఇవ్వడం కోసం పాతవారిలో ఏకంగా ఏడు లక్షల మందికి కోత విధించాలని ప్రయత్నించడమే గ్రామసీమల్లో కలకలం రేపుతోంది. వీరిలో ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర సామాజిక కారణాలతో పింఛన్లు పొందుతున్నవారు ఉన్నారు. ‘పింఛను పొందేందుకు నిబంధనల ప్రకారం మీకు అర్హత లేదు. మీ పేర్లు అర్హుల జాబితా నుంచి ఎందుకు తొలగించరాదో చెప్పండి’ అంటూ గ్రామ సచివాలయాల్లో నోటీసు బోర్డులు అతికిస్తున్నారు. బోర్డులో పేర్లు చూసుకొని లబ్ధిదారులు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామ సచివాలయంలోని సిబ్బందిని కలిసి.. ఏదో ఒకటి చేసి తమ పేరు తీసేయకుండా చూడాలని అభ్యర్థిస్తున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రకటించే తుది జాబితాలో ఉంటామో లేదోనని కలవరపాటుకు గురవుతున్నారు. జగన్‌ వచ్చి పెన్షన్‌ మొత్తం పెంచుతారని భావిస్తే…. ఉన్న పెన్షన్లను తొలగిస్తున్నారని నోటీసుల్లో పేర్లు ఉన్న కొందరు లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.

కడప జిల్లాలో 40 వేలు, నెల్లూరు జిల్లాలో 50 వేలకుపైగా, పశ్చిమగోదావరిలో 20 వేలు, కృష్ణా జిల్లాలో 90 వేలు, ప్రకాశంలో 70 వేలు, అనంతపురం జిల్లాలో లక్షమందికి పైగా పేర్లు ప్రస్తుతం కోత కత్తి కింద ఉన్నాయి. వీరంతా కొన్ని సంవత్సరాలుగా పింఛన్లు పొందుతూ, గత నెల 13వ తేదీన జగన్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త మార్గదర్శకాలతో ఒక్కసారిగా అనర్హులుగా మారారు. సాధారణంగా మార్గదర్శకాలను కొత్త లబ్ధిదారులకు వర్తింపజేయాలి. కానీ, కొత్త, పాత అన్నింటికీ కలిపి ఒకే నిబంధనలు అమలులోకి తీసుకురావడంతో సామాజిక పింఛనుదారులకు పెద్ద చిక్కే వచ్చిపడింది. కుటుంబ ఆదాయ పరిమితి గ్రామాల్లో రూ.10 వేలు , పట్టణాల్లో రూ.12 వేలలోపు ఉంటేనే సామాజిక పింఛన్లకు అర్హులవుతారు. ఒక్కో కుటుంబం మూడు ఎకరాలు మాగాణి లేక 10 ఎకరాల మెట్ట లేక రెండు కలిపి 10 ఎకరాల లోపే భూములు కలిగి ఉండాలి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు పలు మెట్ట ప్రాంతాల్లో 10 ఎకరాల పైబడిన కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయని అందరికీ తెలిసిందే. గతంలో వారి విషయంలో నిబంధనలు పెద్దగా పట్టించుకోకుండా పెన్షన్లు మంజూరుచేశారు. ఇప్పుడు వాటిని తొలగిస్తున్నారు. సొంత కారు ఉన్నా, నెలవారీ విద్యుత్‌చార్జీలు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్నా అనర్హులే.

చాలా మంది యువకులు ట్రాన్స్‌పోర్టు కింద రిజిస్టర్‌ చేసుకోకుండా సొంత కారు కింద ట్యాక్సీలు నడుపుుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు భారీగా ట్యాక్స్‌లు చెల్లించలేక ఈ దారి తొక్కుతున్నారు. ఇలాంటివారినీ సొంతకారు ఓటర్లుగా గుర్తించి.. ఆ కుటుంబంలో ఎవరైనా సామాజిక పింఛను పొందుతుంటే కోత పెడతారు. ఏడాదిలో ఎప్పుడైనా ఒక నెలలో 300 యూనిట్లు దాటి ఉంటే అలాంటి కుటుంబంలోని పెన్షన్లకు చెక్‌ పెట్టారు. కృష్ణాజిల్లాలో 70 ఏళ్ల గుంజాల రామారావుకు ఈ కారణంగానే కోత పడింది. పట్టణాల్లో చిన్న ఇల్లున్న వారికి గతంలో పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు తొలగించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో కొత్తగా పెద్ద పంచాయతీలను కూడా మున్సిపాలిటీలుగా మార్చారు. అవి దాదాపుగా గ్రామీణ ప్రాంతాలను పోలి ఉంటాయి. అలాంటి మునిసిపల్‌ ప్రాంతంలో అందరికీ జాగాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్లంతా పెన్షన్‌ అర్హతను కోల్పోతున్నారు. కృష్ణాజిల్లాలో 34 ఏళ్ల వికలాంగ వ్యక్తికి.. పట్టణంలో 750 చదరపు అడుగుల స్థలం ఉన్నదని.. అనర్హుల్లో చేరారు. అదే సమయంలో వికలాంగులు తప్ప ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు ఇవ్వరాదని నిర్దేశించడం గమనార్హం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి, అంగన్‌వాడీ వర్కర్లు, వీవోఏలు, ఆశావర్కర్లుతో పాటు రూ.10 వేలకు పైబడిన వేతనాలు పొందుతున్న సిబ్బంది కుటుంబాల్లో పెన్షన్‌ కోత పడనుంది.

Related posts