telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా… రాజధాని పనులకు సన్నాహాలు ?

ap map

రాజధాని తరలింపుపై ఒకపక్క వివాదాలు కొనసాగుతున్నాయి.. విచారణ పూర్తయ్యేదాకా తరలించడానికి వీల్లేదని హైకోర్టు ఖండితంగా చెప్పింది. అలాంటి చర్యలు చేపడితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. అయినా విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు పలు శాఖల అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అఽధికారికంగా ఎటువంటి ఆదేశాలు లేవంటూనే.. భవనాల కోసం అన్వేషణ మొదలెట్టారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు, శాఖాధిపతులకు కార్యాలయాల వరకు పలు భవనాలు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంగా పోర్టు గెస్ట్‌హౌ్‌సను ఇప్పటికే పరిశీలించారు. అయితే పోర్టు కేంద్రం పరిధిలో ఉన్నందున అనుమతులు అవసరం. ఈ నేపథ్యంలో మరో అనువైన భవనం ఎంపిక చేయాలని నిర్ణయించారు. రుషికొండ సమీపంలో సముద్ర తీరానికి ఆనుకుని ఒక హోటల్‌ నిర్మాణం జరుగుతోంది. అది పూర్తయితే కొంత భాగాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. తిమ్మాపురం సమీపంలో బావికొండ దిగువన ముఖ్యమంత్రికి శాశ్వత కార్యాలయం నిర్మించే యోచన ఉన్నట్లు సమాచారం. అధికారులు ఈ స్థలాన్ని కూడా పరిశీలించినట్లు తెలిసింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపకులపతి, రిజిస్ట్రార్‌ భవనాలు విశాలంగా ఉండడమే కాకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత ఇన్‌చార్జి వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి బంగళాకు మారలేదు. పూర్తిస్థాయిలో నియామకం ఖరారయ్యాక అక్కడకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బంగళాల విస్తీర్ణమెంతో వివరాలివ్వాలని ప్రభుత్వం నుంచి ఏయూ అధికారులకు సమాచారం వచ్చినట్లు తెలిసింది. డీజీపీ కార్యాలయం కోసం మధురవాడ పరిసరాల్లో పెద్ద భవంతులు పరిశీలిస్తున్నారు. మారికవలస సమీపంలో ఒక కార్పొరేట్‌ కళాశాల నడుస్తున్న భవనాన్ని ఇటీవల అధికారులు చూసివెళ్లారు. దీని విస్తీర్ణం లక్ష చదరపు అడుగుల వరకు ఉంది. వచ్చే జూన్‌ తరువాత ఈ భవనాన్ని కార్పొరేట్‌ కళాశాల ఖాళీ చేయనుంది. అయితే డీజీపీ కార్యాలయం ఏర్పాటుకు కొన్ని నిబంధనలతో కూడిన నిర్మాణాలు అవసరం. అందువల్ల మారికవలసలో భవనం డీజీపీ కార్యాలయానికి కాకుండా మరో విభాగానికి కేటాయించవచ్చని చెబుతున్నారు. ఇంకా నగరంలోని పలు ప్రైవేటు, ప్రభుత్వ భవనాలను ఆయా విభాగాల ఉన్నతాఽధికారులు పరిశీలించి ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఏ అధికారీ విశాఖలో కార్యాలయాలను పరిశీలించిన విషయాన్ని అధికారికంగా చెప్పకపోవడం గమనార్హం.

Related posts