న్యూజిలాండ్ కెప్టెన్, కేన్ విలియమ్సన్ తన 29వ పుట్టిన రోజుని విచిత్రంగా జరుపుకొన్నాడు. మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన అభిమానులు అతడికి కేక్ తినిపించడంతో ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న కివీస్ జట్టు వచ్చే వారం నుంచి రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్స్ XI జట్టుతో న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ ఆడుతోంది.
మొదటి రోజు బ్యాటింగ్ ఆరంభించిన లంక ప్రెసిడెంట్స్ ఆరు వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. గుణతిలక(98), సమరవిక్రమ(80), ప్రియంజన్(56) చెలరేగడంతో భారీ స్కోర్ సాధించింది. కివీస్ స్పిన్నర్ అజాస్ పటేల్ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా మ్యాచ్ విరామ సమయంలో విలియమ్సన్ అభిమానుల వద్దకు వెళ్లి కరచాలనం చేసి సరదాగా గడిపాడు. అదే సమయంలో కొందరు అభిమానులు కేక్ తీసుకొచ్చి అతడికి తినిపించారు. అభిమానుల ప్రేమకు సంతోషం వ్యక్తం చేసిన విలియమ్సన్ తర్వాత మైదానంలోకి వెళ్లి ఆటను కొనసాగించాడు.