telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

హీరో

vijayam poetry corner

ఆరడుగుల
ఆజానుబాహువు
నిలువెత్తు విగ్రహం
నడిచే చెమటచుక్క
మాట్లాడే సింగం
నా మనోసినీజగత్తు హీరో
ఆయన కాక మరెవరు

ఎమ్మెల్యే పంచలో ఆయన్ని
చూడాలన్న ఆశ…
ఆశ వెనుక నిరాశ
నిరాశ తోడి నిట్టూర్పు

మధ్యతరగతి బండి లాగిన
ఒంటెద్దు జంట పట్టెడల్లా
తనకోసం ఓ జతా
అమ్మకోసం మరో జతా
జత పంచలుండేవి తనకి
ఒకటి ఒంటిపై
ధగధగలాడుతుంటే
మరొకటి సాకిరేవులో
రెపరెపలాడేది.

కానీ
పండుగ మాత్రం నిఝంగా
పండుగే మాకు!
ఊరికి పండుగొస్తే
నాకు కనులపండుగొచ్చేది
నాన్నకి కనపడ్డాడో లేదో గాని
దేవుడు నాకు మాత్రం
ప్రత్యేక దర్శనం ఇప్పించేవాడు

ధవళ వర్ణపు పంచె
చెంగులు నాన్న వేళ్ళ మధ్య
కుచ్చిళ్ళై ముచ్చటపడుతుంటే
చూపుల్నక్కడ కట్టేసేవాడిని
బిళ్ళ గోచీ నాన్న వెన్నును
తాకుతుంటే
చూపులతో నాయిన రాజసాన్ని తడిమేసేవాణ్ణి

వెండిచుక్కల ఎన్టియార్ చొక్కా
నాన్న తలమీంచి చేతుల్లోకీ
ఛాతీమీంచి పొట్ట పైకీ చేరగానే
నిలువెత్తు దేవుడై
నాముందు నిలబడేవాడు
శివుడెదురు బసవన్నలా తనువుంటే
పావురమై నా మనసు
నాన్న చుట్టూ గిరికీలు కొట్టేది

ఖద్దరు పైపంచ
నాన్న తలనుచుట్టుకోగా
ఒకంచును పట్టి నాలుగు వేళ్ళు
లోపలికి బిగిస్తుంటే
బొటనవ్రేలు ఒద్దికగా సర్దుతుంటే
గర్వంగాచూసిన బాల్యం
నాన్నని హీరోగా గుండెల్లో నిలబెట్టేసింది
నాకన్నా నాన్నని మిన్నగా
ప్రేమించేసింది హృది
ఎప్పుడు నాన్నని కొత్తబట్టల్లో చూసినా
మది గదిదాటి నదిలా పారేది

బిడ్డ లెక్కల్లో దిట్ట అనీ
లెక్కల పంతులనీ సంబరపడ్డాడుగానీ
పంచె లెక్కల్లో ఒకంకె
దాట లేకపోయాడని మాత్రం
లెక్కేయలేదు
బిడ్డలు చల్లంగుంటె చాలనుకొన్న
నాన్న ఉదారతతో
నాన్నకి నా బాకీలలో
కొత్తబట్టలూ చేరాయి.

అయినా… నాన్నదీ తప్పుంది
నా వేలెప్పుడన్నా
బట్టల కొట్టు వైపు చూపెడితే
తన వేలు నా బిడ్డలవైపు తిరిగేది
లేడికి లేచిందే పరుగులా
ఇలా వెళ్ళి అలా వచ్చే నాన్న
ఉత్తర దిక్కుగా వెళ్ళి
తిరిగి రానే లేదు…
రెండేండ్ల సంది నా చూపులూ
ఆగలేదు….
నాన్నా…
పన్నీటి చుక్కల్ని నీపై చిలకరించలేకపోయా…
అందుకే…
కన్నీటి సిరా చుక్కలతో పలకరించాలనుకుంటున్నా
నాన్నే..నా హీరో
నాన్నా… నువ్వే నా రియల్ హీరో…

నాన్నకు ప్రేమతో…

🙏 సైదులు అరేపల్లి🙏

Related posts