telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

పాఠశాల పిల్లలకు హెల్మెట్లు.. పెచ్చులు ఊడితే తలపగలకుండానట.. పంతుళ్ళకు కూడా..

govt teacher teach with helmet in class

ప్రభుత్వ ఉపాధ్యాయుడు తరగతి గదిలో తలకు హెల్మెట్ ధరించి పాఠాలు బోధించారు. సామాన్యులు తమ సమస్యలను పాలకుల దృష్టికో, అధికారుల దృష్టికో తీసుకెళ్లడానికి నిరసనలు చేస్తుంటారు. మరి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇలా ఎందుకు నిరసన చేయాల్సి వచ్చిందనేది విస్మయం కలిగిస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. గోడలు, స్లాబ్‌కు పగుళ్లు ఏర్పడి పెచ్చులూడుతున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో బోధన కొనసాగుతున్న ఈ పాఠశాలను ఇలాంటి పరిస్థితిలో చూసి కూడా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ స్కూల్‌లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతోంది. ఆరుగురు ఉపాధ్యాయులు, 89 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో మౌలిక వసతులు కూడా అంతంత మాత్రమే.

పాఠశాల శిథిలావస్థకు చేరుకున్న క్రమంలో స్లాబ్ పెచ్చులు ఎప్పుడు ఊడి పడతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి దుర్భర స్థితిలోనే విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. ఆ పాఠశాలలో గణితం సబ్జెక్టు బోధిస్తున్న దస్రు అనే ఉపాధ్యాయుడు వింత నిరసన చేపట్టారు. పాఠశాల పరిస్థితి అధికారులకు తెలిపేలా వినూత్న నిరసనకు దిగారు. తలపై హెల్మెట్ ధరించి విద్యార్థులకు పాఠాలు చెప్పడం చర్చానీయాంశమైంది. అదే సమయంలో పిల్లలు కూడా తమ తలలపై పలకలు ఉంచుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఊడిపోతాయో తెలియని స్లాబ్ పెచ్చులు తమ ప్రాణాలకు గండంగా మారిందని ఇలా ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా.. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా వ్యవహరిస్తారా అనేది చూడాలి.

Related posts