telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎండాకాలంలో మట్టి కుండలో నీళ్లు తాగితే.. ఎన్నో ప్రయోజనాలు !

ఎండాకాలం వచ్చేసింది. దీంతో మధ్యాహ్నం కాగానే ఎండలు దంచికొడుతున్నాయి.  ఈ వేసవి కాలంలో దాహం వేసే ఆహార పదార్దాలు తీసుకోకుంటేనే మేలు. లేనిపక్షంలో అనవసరంగా అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. అందుకే తియ్యగా, చల్లగా ఉండే ఆహారాలనే తీసుకోవాలి. పలుచని చారు, కారం లేని పులుసు, మజ్జిగ చారు, పెరుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాహం లేకపోయినా(ఖచ్చితంగా ఉంటుంది), కుండలోని నీళ్లు తాగుతూ ఉండాలి.

ఈ వేసవిలో చల్లని నీరు తాగితే ఉపశమనంగా ఉంటుందని చాలామంది భావిస్తారు, కానీ అది నిజం కాకపోగా, ప్రమాదం కూడా; ఫ్రిజ్‌ నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉంది. ఉప్పు కలిపిన పలుచటి మజ్జిగ; కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి వేసవిలో శరీరానికి అందుతుండాలి. అలాగే ఈ సీజన్ లో లభ్యమయ్యే పుచ్చకాయ, కర్బూజా, తాటి ముంజెల్లో ఖనిజ లవణాలు అధికం. వేసవిలో వీటిని తీసుకుంటే డీహైడ్రేషన్‌ నుంచి తప్పించుకున్నట్లే.

ఈ కాలంలో ముఖ్యంగా మట్టి కుండల్లో నీటిని ఉంచి.. ఆ నీటిని సేవించాలి. మట్టికుండ రుతువును, ఉష్ణోగ్రతను బట్టి నీటిని చల్లగా ఉంచుతుంది. పెద్దలు చెప్పినట్టుగా వానాకాలంలో రాగి పాత్రలో నీరు, ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు తీసుకోవడం ఆరోగ్యరహస్యం. అంతే కాకుండా మట్టిలోని ఆల్కలైన్ అనేది.. నీటిలో ఆమ్లాలు చేరకుండా భద్రపరుస్తుంది. తద్వారా అసిడిటీ సమస్య ఉత్పన్నం కాదు. అందుకే మట్టి కుండల్లో వండే ఆహారం తీసుకుంటే గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మట్టికుండల్లోని నీటిని తాగడం ద్వారా శరీర మెటబాలిజాన్ని మెరుగుపడుతుంది. ఇంకా గొంతుకు సంబంధించిన రోగాలను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. 

Related posts