పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నాను విరమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సీఎం మధ్య నెలకొన్న వివాదంతో ఆదివారం రాత్రి నుంచి మమతా బెనర్జీ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పుతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. తీర్పు తమకు అనుకూలంగా ఉన్నందున తాను చేపట్టిన ధర్నాను విరమిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం మమతా బెనర్జీ ప్రకటించారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ విచారణకు సహకరించాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
అలాగే రాజీవ్ ను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలేవీ చేపట్టకుండా సీబీఐని కోర్టు నిలువరించింది. అయితే ఈ తీర్పు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంప పెట్టు అనీ, సీబీఐకి లభించిన నైతిక విజయమని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాజీవ్ కుమార్‌పై సీబీఐ చర్యలను అడ్డుకోవాలంటూ బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైన కలకత్తా హైకోర్టు కూడా విచారణ చేపట్టి, కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కారణంగా గురువారం వరకు వాయిదా వేసింది.