telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ లో మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాము: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.

సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్లు, చదువులు పూర్తి చేస్తున్న విద్యార్థులకు దీని ద్వారా నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.

సోమవారం నాడు ఆయన కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించారు.

ప్రస్తుతం 500 మంది ఇంజనీర్లు పనిచేస్తున్న కోవాసెంట్ మరో రెండేళ్లలో 3000 మంది ప్రతిభావంతులను ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు.

ఏఐ సాంకేతిక దూకుడుతో కోడింగ్ లో ఉన్నవారు ఇతర ప్లాట్ ఫారాల్లో పనిచేస్తున్న వారు నైపుణ్యాలను పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

వారందరికి ఏఐ యూనివర్సిటీ ద్వారా రీస్కిల్, అప్ స్కిల్స్ అందిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా కోవాసెంట్ ఛైర్మన్ సి.వి. సుబ్రమణ్యంను ప్రత్యేకంగా ప్రశంసించారు.

18 మంది ఉద్యోగులతో దశాబ్దాల క్రితం సిగ్నిటీ పేరుతో సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించిన ఆయన ఇవ్వాళ వేల మంది సిబ్బందితో ప్రపంచస్థాయి సంస్థగా కోవాసెంట్ ను తీర్చిదిద్దారని శ్రీధర్ బాబు చెప్పారు.

టెక్నాలజీ అంటే సిలికాన్ వ్యాలీ, ప్రపంచ ప్రొడక్షన్ సెంటర్ గా చైనాలోని షెంజెన్, క్రమశిక్షణ, సుపరిపాలన కలిగిన దేశంగా సింగపూర్ ల గురించి చెప్తారని, ఈ మూడు లక్షణాలు కలగలిసిన నగరంగా హైదరాబాద్ రూపొందుతోందని తెలిపారు.

ఇక్కడ ఉన్న అనుకూల పర్యావరణం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు.

Related posts