ప్రపంచ కప్ లో పాక్‌పై భారత్ విజయం మరో సర్జికల్ స్ట్రైక్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పాక్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లాండ్ వేదికగా ఆదివారం జరిగిన భారత్ -పాక్ మ్యాచ్‌లో పాక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో భారత్‌లో సంబరాలు అంబరాన్నంటుతుంటే, పాక్ మాత్రం దీనిని జీర్ణించుకోలేక పోతోంది. తమ దేశపు ఆటగాళ్లపై పాకిస్తాన్ దేశంలో అక్కడి క్రికెట్ అభిమానులతో పాటు అందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పాక్‌పై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన సందర్భంగా దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాక్‌పై భారత్ విజయాన్ని ఆయన మరో సర్జికల్ స్ట్రైక్‌గా అభివర్ణించారు. దీనిపై పాక్ ఆర్మీ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. మ్యాచ్, సర్జికల్ స్ట్రైక్‌లు అనేవి వేర్వేరు అంశాలని, ఒకదానిని మరొక దానితో ముడి పెట్టవద్దని పేర్కొంటూ ట్వీట్ చేశారు.