telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“హిట్” మూవీ మా వ్యూ

Hit

తారాగణం: విశ్వక్ సేన్, రుహానీ శర్మ, మురళి శర్మ, బ్రహ్మజీ ఇతరులు
దర్శకుడు : శైలేష్ కొలను
నిర్మాత : నాని, ప్రశాంతి టిపిర్నేని
సంగీతం : వివేక్ సాగర్
రన్ సమయం : 2 గం 06 నిమి.
విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020

నేచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా నిర్మాణంలో వస్తోన్న చిత్రం కావడంతో ‘హిట్’ సినిమాకు మంచి పాపులారిటీ వచ్చింది. దీనికి తోడు ప్రచార కార్యక్రమాలను కూడా బాగా నిర్వహించడం ప్లస్ అయ్యింది. రాజమౌళి, అనుష్క, రానా వంటి వాళ్లతో ప్రమోట్ చేయించి సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చారు నాని. మరోవైపు, ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఈ చిత్రంలో హీరోగా నటించడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేసిందో లేదో సమీక్షలో తెలుసుకుందాం.

కథ :
విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. అతను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ తో బాధ పడుతుంటాడు. మరోవైపు సిఐ (మురళి శర్మ) నిర్లక్ష్యం కారణంగా కాలేజీకి వెళ్లే అమ్మాయి ప్రీతి ఔటర్ రింగ్ రోడ్‌లో తప్పిపోతోంది. ఈ క్రమంలోనే విక్రమ్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఫోరెన్సిక్ ఆఫీసర్ నేహా (రుహానీ శర్మ) కూడా తప్పిపోతుంది. నేహా తప్పిపోయిన కేసులో అభిలాష్ అనే అధికారి విక్రమ్‌ను అనుమానిస్తాడు. అసలు ప్రీతికి ఏమి జరిగింది? ఆమెకు నేహా కిడ్నాప్ మధ్య సంబంధం ఏమిటి? విక్రమ్‌కు ఎందుకు అనుమానం? విక్రమ్ కు ట్రామాటిక్ స్ట్రెస్ ఎందుకు వస్తుంది ? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
విశ్వక్ సేన్ దూకుడు స్వభావం కలిగి ఉన్న నటుడు. దర్యాప్తు అధికారి పాత్రలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ తో బాధపడుతున్న అధికారి పాత్రలో అతను సరిగ్గా సరిపోయాడు. ఇక హీరోయిన్ రుహానీ శర్మ తన పాత్రలో ఫర్వాలేదనిపించింది. సినిమాలో విశ్వక్ సేన్ మరియు రుహానీ శర్మల మధ్య లవ్ ట్రాక్ మంచి రిఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఇతర నటీనటులు మురళి శర్మ, భాను చందర్, బ్రహ్మజీ, హరితేజా తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఆయా పాత్రల పరిధి పరిమితంగా ఉంది.

సాంకేతిక వర్గం పనితీరు :
మణి కందన్ సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం అంత సులభం కాదు కాని వివేక్ సాగర్ ఇచ్చిన బీజీఎమ్ మాత్రం సూపర్. గ్యారీ ఎడిటింగ్ బాగుంది. శైలేష్ కొలను కొత్త దర్శకుడు అయినప్పటికీ అతను తీసుకున్న సబ్జెక్టుతో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించాడు. ప్రథమార్థం, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నాయి. అయితే ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. సినిమా ద్వితీయార్థంలో స్లోగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ ఓకే. కానీ క్రైమ్స్ కు జరగడానికి గల అసలు కారణం ప్రేక్షకులకు కన్విన్సింగ్ గా అన్పించదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts