telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబుతో వర్మ భేటీ- పవన్ మెజార్టీపై క్లారిటీ..!

ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి.

గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిపాలైన పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే ఇందుకు కారణం.

అయితే పవన్ ఎన్నికను తన భుజాలపై వేసుకుని, అంతా తానై వ్యవహరించిన టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తాజాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబుతో భేటీ అయ్యారు.

పిఠాపురంలో ఏం జరిగిందో ఆయనకు వివరించారు.

చంద్రబాబును హైదరాబాద్ నివాసంలో కలుసుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ .. పిఠాపురం ఎన్నికలు జరిగిన తీరును వివరించారు. స్థానికంగా పవన్ కళ్యాణ్ కు తాము అందించిన మద్దతు గురించి తెలిపారు.

దీనిపై వర్మ ఓ ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలువబోతున్నారని చంద్రబాబుకు వివరించినట్లు వర్మ ట్వీట్ లో పేర్కొన్నారు.

దీంతో ఆయన ట్వీట్ కు స్పందనగా జనసేన క్యాడర్ కూడా తాము రాష్ట్రంలో అదే విధంగా టీడీపీ విజయం కోసం పనిచేసినట్లు ట్వీట్లు పెడుతున్నారు.

మరికొందరు వర్మ త్యాగాన్ని అభినందిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ కు 50 వేలకు పైగా మెజార్టీ వస్తుందని జనసేన, టీడీపీ నేతలు ఇప్పటికే అంచనా వేసుకుంటున్నారు.

Related posts