రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించి, పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
పర్యాటకులు ఎక్కువగా సందర్శించే అరకు, గండికోట, సూర్యలంక ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా మూడు టెంట్ సిటీలను అభివృద్ధి చేయనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.50 కోట్లకు పైగా వ్యయంతో మొత్తం 150 గదులు అందుబాటులోకి రానున్నాయి. ఈ గదుల్లో స్టార్ హోటళ్లకు దీటుగా సౌకర్యాలు కల్పించనున్నారు.
ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన పర్యాటక విధానాలను ఏపీలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గుజరాత్‌లోని కెవాడియా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య తరహాలో ఈ టెంట్ సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపింది.
అరకులో ఏపీటీడీసీ సొంతంగా టెంట్ సిటీని నిర్మించనుండగా, గండికోట, సూర్యలంకలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో వీటిని ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలవనున్నారు.
ప్రస్తుతం అరకులోని ఏపీటీడీసీ రిసార్ట్‌లలో వసతులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో అక్కడ పది ఎకరాల విస్తీర్ణంలో టెంట్ సిటీని ఏర్పాటు చేసి 50 గదులను నిర్మిస్తారు. దీనికి రూ.18 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా.
గండికోటలో కూడా పది ఎకరాల్లో పీపీపీ పద్ధతిలో టెంట్ సిటీ రూపుదిద్దుకోనుంది. ఇక్కడ 60 గదులు అందుబాటులోకి వస్తాయి.
ఇప్పటికే ‘సాస్కీ’ పథకం కింద రూ.78 కోట్లతో గండికోట అభివృద్ధి పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఈ పనులు పూర్తయితే సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో విశాఖ ఆర్కే బీచ్ తర్వాత పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో కూడా వసతుల కొరత ఉంది. ఇక్కడ పది ఎకరాల్లో పీపీపీ విధానంలో 50 గదులతో టెంట్ సిటీని అభివృద్ధి చేయనున్నారు.

