telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పవన్ చంద్రబాబు ఉచ్చులో ప‌డొద్దు..

‘భీమ్లా నాయక్‌’ను జగన్ తొక్కేయడమేంటి? జీవో ఇస్తామని చెప్పామా?
ఏపీ లో ఇప్పుడు భీమ్లా నాయక్‌ వర్సెస్‌ ఏపీ సర్కార్‌ ఫైట్‌ రసవత్తరంగా నడుస్తోంది. భీమ్లా నాయక్ సినిమాపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాడేపల్లిలో మీడియాతో మాట్లాడినాయన.. జగన్మోహన్ రెడ్డి శత్రువులు, మిత్రుల గురించి ఆలోచించరు.. ప్రజల గురించే ఆలోచిస్తారని తెలిపారు. సినిమా టికెట్ల వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై నాని ఘాటుగా స్పందించారు.

సినిమా పరిశ్రమలో సమస్యలకు చంద్రబాబే కారణం అని ఆరోపించిన ఆయన.. కోర్టుకు వెళ్లి అడ్డగోలుగా ఆదేశాలు తెచ్చుకుని ప్రజలను దోచుకున్నా చంద్రబాబు.. గుడ్డివాడుగా వ్యవహరించాడని మండిపడ్డారు.

అలాగే భీమ్లా నాయక్‌ను జగన్ తొక్కేశారు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని.. ఫిబ్రవరి 25వ తేదీన జీవో ఇస్తున్నాం… సినిమా రిలీజ్ చేసుకోండి అని ప్రభుత్వం గానీ, వైసీపీ గానీ చెప్పలేదు కదా? అని ప్రశ్నించారు. న్యాయ పరమైన అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్న కొడాలి నాని.. ఈలోపు మా మంత్రి చనిపోవడంతో నాలుగు రోజులు ఆలస్యం అయ్యిందన్నారు.

చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన పవన్‌కు సూచించారు. సినిమాలను.. రాజకీయాలకు ముడిపెట్టొద్దని సూచించారు. టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని పేర్కొన్నారు.

చంద్రబాబు ఉచ్చులో పడొద్దని పవన్‌కు సూచించారు. చిరంజీవిని జగన్ ఎంతో గౌరవిస్తారని.. దానిని తప్పుబట్టడం సరికాదన్నారు.

తల్లి లాంటి సినిమా పరిశ్రమను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్త చేశారు కొడాలి నాని.. సినిమా ఆడకపోతే పవన్‌ కల్యాణ్‌ను నష్టం ఉండదు.. పవన్‌కు తన రెమ్యునరేషన్ తనకు అందిందన్న ఆయన.. నర్సాపురం మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవిపైనే విమర్శలు చేశారని ఆరోపించారు.

గతంలో చిరంజీవి సతీసమేతంగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చిన విషయాన్ని పవన్ మర్చిపోయాడా? అని ప్రశ్నించిన కొడాలి నాని.. చిరంజీవిని ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విషయాన్ని పవన్ మర్చిపోయారా? అంటూ మండిపడ్డారు.

స్వయంగా చిరంజీవే భారతమ్మ తనను ఎంతో మర్యాదగా చూశారని చెప్పిన విషయం తెలియదా? అని నిలదీశారు. క్యాంపు కార్యాలయానికి స్వయంగా సీఎం వాహనమే వెళ్లదన్నారు కొడాలి.. సీఎం కూడా ఇంట్లో నుంచి నడుచుకుంటూనే క్యాంపు కార్యాలయానికి వెళ్తార‌ని అన్నారు.

నాగార్జున అయినా.. పవన్ కల్యాణ్ అయినా ప్రభుత్వం దృష్టిలో ఒకటేనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీచేస్తుందని.. ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగన్ సీఎం అవుతారన్నారు. సీఎం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.

Related posts