ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆప్ ను గెలిపించి దేశ ఆత్మను కాపాడారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. మూడోసారి సీఎం పీఠంపై కూర్చోనున్న కేజ్రీవాల్ కు ప్రశాంత్ కిషోర్ అభినందనలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు. ఆప్ గెలుపు కోసం కృషి చేశారు. ఆప్ ఎన్నికల ప్రచారంలో కీ రోల్ ప్లే చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్ స్పష్టమైన లక్ష్యంతో ప్రజల దగ్గరకు వెళ్లారు. ఢిల్లీ సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. వాటన్నింటినీ తీర్చేందుకు కావాల్సిన అంశాలు, వనరులపై మేధావులతో చర్చించారు. మేనిఫెస్టో రూపకల్పన సైతం 2015లో డివిజన్ల వారీగా, రాష్ట్రం మొత్తానికి అవసరమైన విధానాలను పొందుపరిచి ప్రజల ముందుకెళ్లారు. దీంతో 70 స్థానాలకు 67 స్థానాలను క్లీన్ స్వీప్ చేశారు కేజ్రీవాల్. ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరించారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం (ఫిబ్రవరి 11,2020) వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆప్ 63 కి పైగా స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 35. ఇక బీజేపీ విషయానికి వస్తే.. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఓటర్ల మనసులు గెల్చుకోలేకపోయారు.
Thank you Delhi for standing up to protect the soul of India!
— Prashant Kishor (@PrashantKishor) February 11, 2020