ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు.
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ షావలిఖాన్, ఇతర అధికారులు కర్నూలులో మంత్రి భరత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి రూ.కోటి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
ఈ నిధులను ఓర్వకల్లు సమీపంలో అసంపూర్తిగా ఉన్న యూనివర్సిటీ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వినియోగిస్తామని వీసీ ప్రొఫెసర్ షావలిఖాన్ తెలిపారు.
యూనివర్సిటీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందజేసిన మంత్రి భరత్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
విద్యారంగ అభివృద్ధికి మంత్రి అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు.
మంత్రిని కలిసిన వారిలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ లోకనాథ, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు సూరీ మన్సూర్ అలీఖాన్, డీఎండబ్ల్యూవో సబిహా పర్వీన్ తదితరులు ఉన్నారు.

