telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక సినిమా వార్తలు

ఆ ‘మాట’ మాటున ఓ మనసుంది!

Ganesh Patro

(ఈరోజు గణేష్ పాత్రో జయంతి — 22 జూన్ 1945 – 5 జనవరి 2015)

‘అంతులేని కథ’లో ఓ చోట ‘పెళ్లికాని అమ్మాయికి అంత గర్వం ఉండకూదమ్మాయి..’ అంటూ కసురుమంటుంది ఒకావిడ. ‘పెళ్లికాని అమ్మాయికి ఉండకూడదనిది గర్వం కాదు.. గర్భం..’ అంటూ సమాధానం చెబుతుందామ్మాయి.

ఈ ఒక్కమాట చాలు రచయితగా గణేష్‌పాత్రో ప్రతిభను కొలవడానికి. ఇప్పుడు పంచ్‌లని మాటని కుదించేస్తున్నారు గానీ.. ఆ పోకడ గణేష్‌పాత్రో రోజుల్లోనే ఉంది. తెలుగు సినిమా డైలాగ్‌ అంటే చాంతాడంత ఉండాల్సిందే అనుకొనే రోజుల్లో దాన్నిలా మదించి, కుదించి మనకందించారు గణేష్‌ పాత్రో.

‘అంతులేని కథ’, ‘రుద్రవీణ’, ‘ఆకలి రాజ్యం’, ‘మరోచరిత్ర’, ‘సీతారామగారి మనవరాలు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఇలా ఒకదానికీ మరోదానికీ పొంతనలేదు. కథ ఏదైనా, సన్నివేశం ఎలాంటిదైనా తన మాటల వాడిని వేడిని చూపించారు గణేష్‌ పాత్రో. బాలచందర్‌ తెలుగు సినిమాలకు ఆత్మగా నిలిచారు. ఆయన గతించిన కొన్నిరోజులకే ఆత్మ కూడా ఆయన్ని అనుసరించింది.

నాటక రంగం నుంచి సినిమాలవైపు అడుగుపెట్టారు పాత్రో. నాటక రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించి సినిమాలకు గట్టి పునాది వేసుకొన్నారు. ‘పావలా’ నాటిక మానవ సంబంధాలపై పాత్రో సంధించిన అస్త్రం. సినిమాల్లోనూ అదే దూకుడు చూపించారు. మరీ ముఖ్యంగా బాలచందర్‌ విజయాల్లో గణేష్‌ పాత్రో వాటా ఉంది. బాలచందర్‌ భావాల్ని అర్థం చేసుకొని, ఆయన ఊహల్లో మెదిలిన సన్నివేశాలకు తన మాటలతో ప్రాణం పోశారు పాత్రో. బాలచందర్‌ ఆలోచనల స్థాయిని అందుకొని ఆయనకు సమాంతరంగా, భావాలకు అనుగుణంగా మారిపోవడం పాత్రోకి ఎలా సాధ్యమైందో..?! బహూశా పాత్రో కూడా మధ్య తరగతి జీవితం అనుభవించినవారు కావడంతో..బాలచందర్‌తో సమానంగా అడుగులు వేయగలిగారేమో..?

‘ఆకలి రాజ్యం’లో ప్రతీమాట మనసుల్ని, మనుషుల్ని సూటిగా తాకేదే. మరీ ముఖ్యంగా శ్రీశ్రీ పుస్తకాల్ని మూడు రూపాయల కోసం తుకానికి వేసినప్పుడు కమల్‌ పలికిన పలుకులు గుండెని భారం చేసేస్తాయి.

‘‘శ్రీశ్రీ నాకు దేవుడునుకొన్నాను. కానీ ఆ దైవాన్ని కూడా కదలించే దెయ్యం ఆకలి. ఆకలి ఊదే నాద స్వరానికి ఆడకతప్పదు ఎవరైనా’’ అంటూ ఆకలి బాధని అక్షరబద్ధం చేశారు.

‘‘ఎలాగైనా బ్రతికేయాలి అనుకొంటే ఎలాగైనా బతికేద్దును. ఇలాగే బతకాలి అనుకున్నాను.. అది వీలు పడదు ఈ దేశంలో’’ అంటూ కథానాయకుడి చేత పలికించారు. ‘ఆకలి రాజ్యం’లోని ప్రతి మాట నిరుద్యోగ భారతంలో శిలాశాసనమైంది.. అదే రాజ్యంగంగా మారింది. పాత్రో శ్రీశ్రీకి వీరాభిమాని. ఆయన అక్షరాల్లో శక్తిని పాత్రో అర్థం చేసుకొని.. తన మాటల్లో అన్వయించుకొంటూ సంభాషణల్ని రూపొందించారు. గణేష్‌ పాత్రో మాట్లాల్లో పదునే కాదు, లోతు కూడా ఎక్కువే. ఆకలి బాధలు ఆయనకు తెలుసు. కన్నీటి రుచీ ఆయనకు తెలుసు. కష్టం విలువ తెలుసు. మానవ బంధాల్ని మామూలు మాటల్లో మహాద్భుతంగా ఆవిష్కరించారాయన. ఆత్రేయ శిష్యుడు కదా.. అందుకే గురువు లక్షణాల్ని పుణికిప్చుకొన్నారు పాత్రో. అందుకే ఆత్రేయ మల్లే పాత్రో మాటకూ ఓ ‘మనసు’ ఉంది. ట్రెండ్‌కి తగిన మాటల్ని రాయడం పాత్రోకే చెల్లింది. ‘మరోచరిత్ర’ ఓ ట్రెండ్‌ సెట్టర్‌. అది అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించింది. ‘హలో గురూ ప్రేమ కోసమేరోయ్‌ జీవితం’ అంటూ టీనేజీ ఓల్టేజీని కరెక్టుగా కనిపెట్టేశారాయన. ఆ పాట ఇప్పటికీ పాడుకొంటూనే ఉన్నాం. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోనూ ఆయన ట్రెండ్‌నే ఫాలో అయ్యారు. ప్రేమ, వినోదం, విప్లవం, భావోద్వేగాలు, అనుబంధాలూ ఇలా ప్రతీ విభాగంలోనూ తనదైన ముద్ర చూపించారు పాత్రో. చాలా ఎక్కువ సందర్భాల్లో ఆడవాళ్లకు వకల్తా పుచ్చుకొని మాట్లాడారు. వీలున్న ప్రతీసారి స్త్రీ పాత్ర ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని కాపాడుకొంటూ వచ్చారు. పాత్రో మరణం ఓ అనుభవశాలిని, మాటకు పలుకుబడి తెచ్చిన ఓ పెద్దాయాన్ని తెలుగు పరిశ్రమ కోల్పోయింది.

రావి కొండలరావు

Related posts