దూరదర్శన్ సీనియర్ న్యూస్ రీడర్ పింగళి పార్వతీ ప్రసాద్(70) అనారోగ్యంతో కన్నుమూశారు. పార్వతీ ప్రసాద్ మరణం పట్ల ఏపీ సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఆకాశవాణి, దూరదర్శన్ లో ఆమె సేవలు నిరుపమానమని కొనియాడారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతీ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
పింగళి పార్వతీ ప్రసాద్ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్మాణంతో ప్రారంభించి వార్తా విభాగంలో సీనియర్ న్యూస్ రీడర్ గా దాదాపు 35 ఏళ్లపాటు సేవలు అందించారు. పార్వతీ ప్రసాద్ కు భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. 80వ దశకం నుంచే ఆమె ఆలిండియా రేడియో, దూరదర్శన్ వంటి ప్రభుత్వ మాధ్యమాల్లో ప్రముఖ న్యూస్ రీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.