telugu navyamedia
రాజకీయ

సెప్టెంబర్​ ఒకటి నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యాసంస్థల పున:ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం చర్చించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు, అంగన్వాడీలనూ తెరవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందన్న వైద్యారోగ్యశాఖ నివేదిక ఆధారంగా, విద్యార్థుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను నెలాఖర్లోగా శుభ్రపరచి, శానిటైజేషన్ చేయాలని పంచాయతీరాజ్, పురపాలకశాఖలను ఆదేశించారు. విధిగా మాస్కులు ధరించేలా, శానిటైజేషన్ చేసుకోవడం లాంటి కొవిడ్ నియంత్రణ చర్యలు విద్యార్థులు తీసుకునేలా చూడాలని తల్లిదండ్రులను కేసీఆర్ కోరారు.

Telangana CM KCR Diagnosed With 'Mild Chest Infection'

అయితే సెప్టెంబర్​ ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీలు సహా అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసినా పిల్లలను తప్పక ప్రత్యక్ష తరగతులకు పంపాలా?.. లేదా? అన్న విషయాన్ని వెల్లడించలేదు. అధికారులు మాత్రం తప్పనిసరిగా పంపాలని చెప్పబోమంటున్నారు.

అంటే పిల్లలను బడులకు పంపాలా? ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చా? అన్నది తల్లిదండ్రుల ఇష్టమేనని స్పష్టమవుతోంది. టీవీల ద్వారా డిజిటల్‌ పాఠాలు యథావిధిగా కొనసాగుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మార్గదర్శకాలపై ఆయా శాఖలు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సీఎం సమావేశం తర్వాత అధికారులతో సమావేశమై చర్చించారు.

కాగా..ప్రభుత్వ నిర్ణయంపై టీఆర్‌టీఎఫ్‌, ఎస్‌జీటీ ఫోరం, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం హర్షం వ్యక్తం చేశాయి. విడతల వారీగా తరగతులను ప్రారంభించాలని ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ సంఘం కోరింది. కళాశాలలను ప్రారంభించడంపై తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్య ఐకాస స్వాగతిస్తోందని ఛైర్మన్‌ పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

Related posts