తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలకు రాష్ట్రము తడిసి ముద్దైంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి, నల్లగొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జనగామలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేనులు నీట మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అయితే..తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ కేంద్రం. తెలంగాణకు వాయుగుండం ముంపు తప్పిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా సమీపంలో వాయుగుండం కొనసాగుతోందని…వచ్చే 12 గంటల్లో అది బలహీనపడుతుందని తెలిపింది. అటు వాయుగుండం ప్రభావం వల్ల గత 24 గంటల్లో మధ్య తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయని తెలిపింది.