telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ క్యాబినెట్‌లో కులగణన, గోశాల పాలసీ, జూనియర్ కళాశాలల పోస్టులు, ఇతర కీలక అంశాలపై చర్చ

తెలంగాణ కేబినెట్ భేటీ శుక్రవారం జరగనుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.

ఈ సమావేశంలో కులగణన, గోశాల పాలసీ, జూనియర్ కళాశాలల పోస్టుల మంజూరు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.

స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన కులగణన నివేదికను క్యాబినెట్‌లో ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కులాల వారీగా గణాంకాల సేకరణ, ఆపై విధానాలు రూపొందించాలనే దిశగా ఈ చర్చ జరగనుంది.

గోశాల పాలసీకి తుది ఆమోదం

వివిధ గోశాలల నిర్వహణ, ఆర్థిక సాయం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రూపొందించిన గోశాల పాలసీపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది .

జూనియర్ కళాశాలల పోస్టులకు ఆమోదం

నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కోసం అవసరమైన అధ్యాపకుల పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

రేషన్ కార్డుల పంపిణీపై మార్గదర్శకాలు

జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.

ఇతర కీలక అంశాలపై చర్చ

ఇందిరమ్మ ఇళ్లు, యూరియా సరఫరా, మంత్రుల జిల్లాల పర్యటనల్లో ఎదురైన అంశాలు, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు, మత్స్య సహకార సంఘాలకు పర్సన్ ఇన్‌ఛార్జ్ నియామకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎం..

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు. కులగణనపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేవంత్ రాహుల్, ఖర్గేలతో సమావేశమై పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించేలా చూడాలని కోరారు. బీజేపీ ఈ బిల్లును అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మరోవైపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను కేంద్ర హోంశాఖకు పంపించారు.

Related posts