ఏపీలో ఉంది రెడ్ల రాజ్యం కాదని.. బడుగుల రాజ్యం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.
ఇవాళ సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం… దేవుడి ఫొటో బదులు సీఎం జగన్ ఫొటో పట్టుకుని చాంబర్‌లోకి ప్రవేశించారు.. చాంబర్‌లో ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించారు.. ఎక్సైజ్‌శాఖలో ఇటీవల మరణించిన ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బడుగులకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యం చూసి.. తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారని పేర్కొన్నారు.
ఇక, నాకు ప్రాధాన్యం లేకుంటే తప్పు చేసిన ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేయగలిగేవాడినా..? అని ప్రశ్నించారు నారాయణస్వామి.. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేస్తున్న ప్రతి సారి బాధపడుతూనే ఉంటానన్న ఆయన.. ఎక్సైజ్ సిబ్బంది ఎవరూ ప్రలోభాలకు గురి కావద్దు.. సస్పెన్షన్లు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు అని సూచించారు.
మరోవైపు.. సీఎం జగన్ ఫొటోతో చాంబర్‌లోకి ప్రవేశించడంపై స్పందించిన ఆయన.. దేవుడి లక్షణాలు కలిగిన మానవుడు సీఎం జగన్.. అందుకే ఆయన ఫొటో పట్టుకునే చాంబర్‌లోకి ప్రవేశించానన్నారు.. కాళ్లు పట్టుకుంటేనో.. కాకపడితేనో జగన్ పదవులివ్వరని.. పార్టీ కోసం పని చేసిన వారికి జగన్ గుర్తింపునిస్తారని వెల్లడించారు.
ఇక, రెండోసారి తనకు పదవి దక్కుతుందని ఊహించలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు.
రాజకీయ నేపథ్యం..
1981లో చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1981–86 వరకు కార్వేటినగరం సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1987లో కార్వేటినగరం మండలాధ్యక్షుడు అయ్యారు. 1989–94 వరకు పీసీసీ సభ్యుడిగా వ్యవహరించారు. 1994, 1999ల్లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2004లో సత్యవేడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందారు. 2014, 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి 2022 వరకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు రెండోసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.

