బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటుండడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. ముంబై పోలీసులు ఎంతో సమర్థత కలిగిన వారని, వారి సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్న వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే తమకు సమర్పించవచ్చని, దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. అంతేకానీ సుశాంత్ కేసు సాకుతో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి ముంబై, పాట్నాలలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ఒకేచోట దర్యాప్తు చేయాలంటూ సుశాంత్ గర్లు ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.