తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యం వల్లే రజనీకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించిన వైద్యులు.. అవసమైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కావేరి ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తీవ్ర తలనొప్పి కారణంగా శుక్రవారం సర్జరీ (కారోటిడ్ ఆర్టరీ రివాస్కులైజేషన్) చేశామని, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం రజనీకాంత్‌ను డిశ్ఛార్జి చేయనున్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
కాగా…గత 45 ఏళ్లుగా భారతీయ సినిమాకు చేసిన అద్భుతమైన సేవలకుగాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు మూడు రోజుల క్రితం రజనీకాంత్ దిల్లీకి వెళ్లారు.
ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలిశారు. ప్రస్తుతం రజనీ నటిస్తోన్న ‘అన్నాత్తే’ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది.