మహారాష్ట్రలో అనేక మలుపులు తిరిగిన రాజకీయ అలజడి ఎట్టకేలకు శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో సద్దుమణిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందిస్తూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాల్లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ పాత్రను ప్రశ్నించారు.
గతంలో ఎన్నడూ ఏ గవర్నర్ ఇలా వ్యవహరించడం చూడలేదని అన్నారు. ప్రధానమంత్రి, హోంమంత్రి అభీష్టాల మేరకే గవర్నర్ కోశ్యారీ నడుచుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. బాధ్యతాయుతమైన గవర్నర్ గా వ్యవహరించాల్సిన అతని ప్రవర్తన గర్హనీయమని అన్నారు. మా కూటమిని దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయని మండిపడ్డారు.


