మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ప్రతిష్టంభన వీడకపోవడం శివసేన పార్టీ ఇప్పుడు ‘ప్లాన్ బీ’ అమలుకు సిద్ధమైనట్టు సమాచారం. ప్రస్తుతం ‘ప్లాన్ బీ’ అమలు పైనే కసరత్తు జరుగుతున్నట్టు శివసేన వర్గాలు వెల్లడించాయి. ప్లాన్ బీలో భాగంగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైతే బయటి నుంచి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతు కూడగట్టాలని శివసేన భావిస్తున్నట్టు సమాచారం. తమ ప్లాన్ బీనే ఇప్పుడు ప్లాన్ ఏగా మారిందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ విషయమై ఇప్పటికే తమ పార్టీ ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపినట్టు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు చెందిన కొందరు నేతలు చెబుతున్న దాన్ని బట్టి ఏదో విధంగా మహారాష్ట్రలో బీజేపీని గద్దె దించే ప్రత్యామ్నాయం కోసం ఆ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశమైన మరుసటి రోజే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను శరద్ పవార్ ఖండించినప్పటికీ.. శివసేనకు వెలుపటి నుంచి మద్దతు ఇవ్వాలన్న దానిపై ఎన్సీపీ, శివసేన పార్టీలు ఓ అవగాహనకు రానున్నట్టు చెబుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలుండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్నాయి. సీఎం పదవిని రెండున్నరేళ్ల పాటు చెరో సగం పంచుకుందామంటూ శివసేన ప్రతిపాదించడం… అందుకు మిత్రపక్షం బీజేపీ తిరస్కరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది.