telugu navyamedia
రాజకీయ

అగ్నిపథ్ స్కీంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

అగ్నిపథ్‌పై దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నిర్ణయాలు మొదట్లో సరిగా లేనట్టుగా కనిపిస్తాయని, కానీ, రానూ రానూ అవి దేశ నిర్మాణంలో దోహదపడుతాయని తెలిపారు. ప్రధాని మోడీ ఈ రోజు కర్ణాటక పర్యటనలో ఉన్నారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో బాగంగా బెంగళూరులో రూ.280 కోట్లతో నిర్మించిన మెదడు పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు ప్రధాని. మరో రూ.28వేల కోట్లతో చేపట్టిన రహదారి, రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజక్టులకు శ్రీకారం చుట్టారు.

21వ శతాబ్దపు భారతదేశం.. సంపద, ఉద్యోగాల సృష్టికర్తలది. నవకల్పనలు కలిగిన వారికీ ఇది సొంతం. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశంగా ఉండడమే భారత్‌ శక్తి, సంపద. గత 8 ఏళ్లలో అంకురాలు, నవకల్పనల మార్గంలో వేగంగా పయనించడం సులభంగా జరగలేదు. కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోవచ్చు, కానీ సమయం గడిచిన తర్వాత ఆ సంస్కరణల లాభాలను ఇప్పుడు దేశం అనుభవిస్తోంది. సంస్కరణల మార్గమే మనల్ని కొత్త సంకల్పాలు, కొత్త లక్ష్యాల వైపు తీసుకువెళుతుంది.

ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌కు బెంగళూరు ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. ఈ నగరం అభివృద్ధి, లక్షలాది మంది అభివృద్ధి అని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలిసి ఈ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాయని తెలిపారు. అయితే అధికార దాహం కలిగిన కొందరు.. ప్రైవేటు రంగాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని విపక్షాలపై ప్రధాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సంస్కరణల మార్గమే మనల్ని కొత్త సంకల్పాలు, కొత్త లక్ష్యాల వైపు తీసుకువెళుతుందని అన్నారు.

కాగా..అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలురాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగానూ మారిన సంగతి తెలిసిందే. కానీ, ఈ స్కీంను వెనక్కి తీసుకునే అవకాశమే లేదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్నది. మిలిటరీ సీనియర్ అధికారులు కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకునే చాన్సే లేదని తెలిపారు. అంతేకాదు, ఈ అగ్నిపథ్ స్కీం కింద రిక్రూట్‌మెంట్లకూ ప్రకటనలూ చేశారు.

Related posts