నేటి నుంచి మూడు రోజుల పాటు పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లపై దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనకు భారత మెడికల్ అసోసియేషన్ శుక్రవారం పిలుపునిచ్చింది. దీంతో పాటు జూన్ 17న సోమవారం దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు తెలిపింది. ఎన్‌ఆర్‌ఎస్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఓ రోగి సోమవారం రాత్రి చనిపోయాడు. దీంతో అతని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ బెంగాల్‌లోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోని జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. ఈ ఆందోళన బెంగాల్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వ్యాపించింది. కోల్‌కతాలో వైద్యులకు మద్దతుగా దేశవ్యాప్తంగా డాక్టర్లు నేడు ఆందోళనకు దిగారు.
ఈ ఆందోళన శని, ఆదివారం కూడా కొనసాగించాలని మెడికల్ అసోసియేషన్ నిర్ణయించింది. వైద్యులు నల్ల బ్యాడ్జులు ధరించి శాంతియుత ధర్నాలు, ర్యాలీలు చేయనున్నట్లు తెలిపింది. ఇక జూన్ 17న దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె చేపట్టనున్నట్లు వెల్లడించింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి అన్ని హెల్త్‌కేర్ ఇనిస్టిట్యూట్‌ల్లోని వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళన చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఎమర్జెన్సీ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని తెలిపింది. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, బెంగాల్ ఘటనలో కేంద్రం చర్యలు తీసుకోవాలని మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
చీఫ్‌జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం డాక్టర్ల సమ్మెపై విచారణ చేసి, మమత సర్కార్ వెంటనే డాక్టర్లతో చర్చలు జరిపి వారు సమ్మెను విరమించేలా చూడాలని సూచించింది.తిరిగి విధుల్లో చేరి సేవలు అందిచేలా చూడాలని కోర్టు ఆదేశించింది. బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన వైద్యసేవలతో చాలా మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ సమ్మెను విరమింపజేయాలని వచ్చిన విజ్ఞప్తిని స్వయంగా విచారణ చేశారు చీఫ్ జస్టిస్. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదు. ఇక జూనియర్ డాక్టర్‌పై సిటీ ఆస్పత్రిలో దాడి జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.