telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమ్మతనం!

కలల లోకంలోని బొమ్మ…
కావాలనుకుంది అమ్మ!
చక్కదనం ….
చెక్కుచెదరకూడదని
అద్దె గర్భం అనుకుంది
అంగీకారం కుదిరింది
అద్దె గర్భం దొరికింది
పిండం పడింది
పెరుగుతూ పోతుంది
అమ్మ కానున్న బొమ్మ….
ఆనందంగా ఉంది!
అమ్మ కాని అమ్మ….
అయోమయంలో ఉంది!
నాకు తమ్ముడువస్తాడా అని
చిన్ని కూతురు అడిగితే
ఏమీ చెప్పలేని స్థితి !
నాకు చెల్లి పుడుతుందా అని
కన్న కొడుకు అడిగితే
నోరు విప్పలేని పరిస్థితి!
తన బిడ్డ కాని బిడ్డను
తన కడుపులో పెంచుతుంది!
తన పేగుతెంచుకు పుట్టినా
తన బిడ్డగా చెప్పుకోలేకపోతుంది!
ఆపరేషన్ ఇక్కడ
ఆనందం అక్కడ !
పురిటి నొప్పులు ఇక్కడ
ప్రమోదం అక్కడ !
కడుపు కోయించుకుని
కమ్మని బిడ్డను కని
కుట్లు ఆరకముందే
అమ్మ బంధం విడిచి
అనుబంధం మరచి
అందాల బిడ్డను
ఆసుపత్రిలోనే ఇచ్చేసి
ఆటే వెళ్ళి పోతుంది….
అమ్మ కాని అమ్మ !
తనబిడ్డనుకాని బిడ్డను
తన కడుపులోమోస్తుంది
నవమాసాలు మోసి
నాలుగు డబ్బులకోసం
కన్న వెంటనే
కాంట్రాక్టు ప్రకారం
కలిగున్నవారికి
కట్టబెడుతుంది….
కన్నీళ్లు ఆపుకుంటూ!
ప్రసవానికి ముందు
పోషకాహారమిచ్చి
పదిలంగా చూస్తే
పుట్టినతరువాత
ఫోకస్ అంతా
ఫోటో షూట్లు.. పార్టీలంటూ
పుట్టిన బిడ్డపై పెట్టి
పచ్చిబాలింతరాలును
పక్కనపెట్టేస్తే….
కడుపుకోయించుకున్న తల్లి
కష్టాలలోకంలోకి….
కదలి వెళ్ళిపోతుంది!
పైసలున్న తల్లి ….
పిల్లపుట్టిందని
పార్టీలలో మునిగితే …..
పురుడు పోసుకున్న తల్లి…..
పత్యం చేస్తుంటుంది !
అమ్మ పాలుతో పెరగవలసిన బిడ్డ….
పోత పాలుతో పెరుగుతుంది!
ఇద్దరమ్మల బిడ్డ ….
ఒకమ్మ బిడ్డగా వెలుగుతుంది!
ఎవరు అమ్మ…. ?
బీజమిచ్చింది అమ్మా ?
బరువుమోసింది అమ్మా ?
కాసులున్నది అమ్మా ?
కాన్పునిచ్చింది అమ్మా ?
పైసలున్నది అమ్మా ?
ప్రసవవేదన పడ్డది అమ్మా ?
అయోమయంలో….అమ్మతనం!

Related posts