telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఇబ్బందుల్లో సీనియర్ నటుడు రావి కొండలరావు… నిర్మాత ఆర్థిక సాయం

Kondalarao

ఈ లాక్‌డౌన్ సమయంలో సీనియర్ నటుడు రావి కొండలరావు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన పడుతున్న ఇబ్బంది గురించి తెలుసుకుని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు స్పందించారు. సీనియర్ నటుడు, విజయ ప్రొడక్షన్స్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసిన రావి కొండలరావు ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని ఆయనకి తక్షణ సహాయం రూ.50 వేలు అందజేశారు. ఈ మేరకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సెక్రటరీలు టి. ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల, నిర్మాత తుమ్ములపల్లి రామసత్యనారాయణ.. రావి కొండలరావు ఇంటికి వెళ్లి ఆయనకు రూ.50 వేల చెక్కును అందజేశారు. ఇబ్బందుల్లో ఉన్న తనకు శ్రీనివాసరావు సహాయం అందించడం పట్ల రావి కొండలరావు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు అందజేయమని ఒక లేఖ రాశారు. త్వరలో ఆయన్ని వ్యక్తిగతంగా కలుస్తానని లేఖలో తెలిపారు. తన ఆపదను తెలుసుకొని తనకు ఆర్థిక సహాయం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రావి కొండలరావుకు తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా, రచయితగా మంచి గుర్తింపు ఉంది. సుమారు 600 సినిమాల్లో కొండలరావు నటించారు. ఆయన సతీమణి రాధా కుమారి కూడా నటి. వీరిద్దరూ దంపతులుగా చాలా సినిమాల్లో కనిపించారు. రాధా కుమారి 2012లో కన్నుమూశారు. ప్రస్తుతం రావి కొండలరావు వయసు 88 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ‘భైరవద్వీపం’, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలకు రావి కొండలరావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న అనేక మంది నిర్మాతలకు, సినీ కార్మికులకు, మీడియా వారికి, యూనియన్ కార్డ్ లేని ఆర్టిస్టులకు ఇప్పటికే శ్రీనివాసరావు సహాయం అందించారు.

Related posts