telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పచ్చిక మెచ్చిన పాదాలు..

 బీడు జబ్బు చేసిన నేలకి

 పచ్చదనాల ఊపిరి పోస్తూ

 చెమట చుక్కలతో మడవ కట్టి

 ఊరికి పచ్చని పగడపు కాంతులను పంచుతాడు

 

ఆ వెలుగుల్లో బోసినవ్వులు నవ్వుకుంటూ

నాటేసిన అతని ఇంట ధాన్య రాసులు

 నాట్యమాడుతాయి

కొత్త బియ్యమై సంక్రాంతి సంబరాలు చేస్తాయి

 

పుట్టిన బిడ్డకంటే పుడమిపైనే

మమకారమెక్కువ

ప్రకృతెంత కన్నెర్ర చేసినా

అతివృష్టి, అనావృష్టి నట్టేట ముంచినా

బురదలో బువ్వని పండిస్తూ

ఆకలి కంచాల ప్రపంచానికి కూడవుతున్నాడు 

 

అందుకేనేమో అతని స్పర్శతాకగానే భూమికి

పచ్చని రంగేసినట్టుంటుంది

అతని పాదస్పర్శ తాకగానే నేల పచ్చదనాల

పురుడు పోసుకుంటుంది

నడిచే పొలం గట్లన్ని పులకించిపోతాయి 

 

వర్షించే మేఘమంటి

ఆ “పచ్చిక మెచ్చిన పాదాలు” కనపడగానే

మంచు ముత్యపు బిందువుల మాటున దాగిన

గడ్డి పూలన్నీ కాలిపగుళ్ళకి లేపనమై ముద్దాడుతూ గర్వంగా రైతు ముఖాన్ని చూస్తూ పులకించిపోతాయి…

 

 

Related posts