telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న తమ కుమారులను రక్షించాలంటూ మహిళ వినతి, వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్

ఉద్యోగాల ఆశతో విదేశాలకు వెళ్లి మానవ అక్రమ రవాణా ముఠాల చేతిలో చిక్కుకున్న తమ బిడ్డలను రక్షించాలంటూ ఓ తల్లి పెట్టిన కన్నీళ్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు.

బాధితులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, తక్షణ చర్యలకు మార్గం సుగమం చేశారు.

విజయనగరానికి చెందిన గండబోయిన సూర్యకుమారి అనే మహిళ పవన్ కల్యాణ్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు.

ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయిన తన ఇద్దరు కుమారులతో పాటు మరో ఆరుగురు యువకులు మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, ఎలాగైనా కాపాడాలని ఆమె కన్నీటితో వేడుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పవన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడారు.

మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న 8 మంది తెలుగు యువకుల దుస్థితిని వారికి వివరించి, వారిని రక్షించాలని కోరారు. పవన్ చొరవపై కేంద్ర విదేశాంగ శాఖ సానుకూలంగా స్పందించింది.

బాధితులను వీలైనంత త్వరగా గుర్తించి, సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చింది.

Related posts