ఈ ఆధునిక సమాజంలో కొత్త జనరేషన్ చిన్న చిన్న రోగాలకు, రోజూవారీ జీవన విధానంలో వచ్చే ఇబ్బందులు, బాధలకే తట్టుకోలేకపోతోంది. మానసికంగా చిన్న సమస్య ఎదురైనా దానిని ఎదుర్కోలేక డిప్రెషన్ కు గురవుతున్నారు. అయితే ఇదంతా తల్లిదండ్రుల వల్లేనని చెప్పొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని అంత సుకుమారంగా, సున్నితంగా పెంచుతున్నారు. కొన్నేళ్ళ క్రితం పిల్లలను స్వేచ్ఛగా వదిలేయడమే కాకుండా వారికి వారే చాలా పనులు, విషయాలు తెలిసేలా చేసేవారు. కొంత తెలివి రాగానే చిన్న చిన్న పనులు చేయడం, ఊరంతా తిరిగి ఆడుకుని, చివరికి ఇంటికి చేరుకోవడం వంటి విషయాలు పిల్లలకు తెలిసేవి. కొంత లోక జ్ఞానం కూడా అబ్బేది. మరి ఇప్పుడు పిల్లలకు సొంత తెలివితేటలు కరువవుతున్నాయి. పైగా చిన్న చిన్న పనులను సైతం చేయలేకపోతున్నారు. అయితే పిల్లలను అంత సుకుమారంగా, సుతి మెత్తగా పెంచితే ఏమవుతుందో ఓ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక సర్కస్ లో కొన్ని పులి పిల్లలను పెంచుతున్నారు. వాటికి సరిపడా ఆహారం తెచ్చి పెట్టి వాటిని పెంచుతున్నారు సర్కస్ నిర్వాహకులు. కొన్ని రోజుల తరువాత వాటిని తీసుకెళ్లి ఒక అడవిలో వదిలేశారు. అయితే ఆ అడవిలో వదిలేసిన పులులు మామూలు పులుల్లా అడవిని ఏలలేదు. పైగా వాటిని కొన్ని రోజుల్లోనే అడవి కుక్కలు చంపేశాయి. అదేంటీ పులులను కుక్కలు చంపడమేంటి ? అనుకుంటున్నారా… అక్కడే ఉంది అసలు ట్విస్ట్. సాధారణంగా అడవిలో పెరిగే పులులు చిన్నప్పటి నుంచే ఎలా వేటాడాలి ? ఆహారాన్ని ఎలా సమకూర్చుకోవాలి ? పరిస్థితులను, ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి ? అనేది నేర్చుకుంటాయి. అయితే సర్కస్ లో పెరిగిన పులులకు ఇవేమీ తెలియకుండా పెరిగాయి. వేటాడే అవసరం లేకుండా ఆహరం వాటి దగ్గరకే వచ్చేది. పైగా అడవిలో తిరిగే అవసరం లేకుండా బోనులో బంధించారు కదా… అందుకే వాటికి అడవిలో ఎలా ఉండాలనేది తెలియకపోవడంతో అడవి కుక్కలకు బలైపోయాయి. అలాగే పిల్లల్ని కూడా సర్కస్ లో పులుల్లా సుకుమారంగా, సున్నితంగా పెంచితే సమాజంలోని పరిస్థితులను, ప్రమాదాలను, సమస్యలను ఎలా ఎదుర్కొంటారు ? ఈ సమాజంలో ఎలా బతుకుతారు ? తల్లిదండ్రులారా… పిల్లలను సర్కస్ లో పులుల్లా పెంచకండి. అడవిలో పులుల్లాగా వారు భవిష్యత్ లో అన్ని సమస్యలనూ ఎదుర్కొనేలా పెంచండి.