telugu navyamedia
YCP ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తప్పు చేస్తే శిక్ష తప్పదు: ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌ రోజాకు ఘాటుగా ప్రతిస్పందన

తప్పు చేస్తే తప్పక శిక్షింపబడాలని, అది ఎవరైనా.. ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

వైసీపీ కౌన్సిలర్లపై ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు నేపథ్యంలో మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు.

తాను తప్పు చేస్తూ ఇతరులను దొంగ అనడం రోజాకు అలవాటుగా మారిందన్నారు.

నగరి నియోజకవర్గంలో ఇసుక, బియ్యం స్మగ్లింగ్‌తో రోజాతో పాటు ఆమె అన్నలకు, భర్తకు సంబంధం లేదని కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు.

రూ.12 వేల అద్దె ఇంటినుంచి నేడు ఊరికో ఇంటిని నిర్మించుకునే స్థాయికి ఆమె ఎదిగిందని ఆరోపించారు.నగరిలో ఇటీవల పట్టుబడ్డ ఏడు ఇసుక టిప్పర్లు వైసీపీ కౌన్సిలర్లవేనని,వాటిని పట్టించింది తామేనని, ఆ విషయాన్ని రోజా గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఎమ్మెల్యేగా గెలిచాక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ప్రతి గ్రామంలో తిరిగానని,ఆ విషయం ఏడాదికాలంగా దినపత్రికలు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు.

అనవసరంగా నియోజకవర్గంలో కన్పించడం లేదని మాట్లాడడం సబబు కాదన్నారు.

Related posts