గత కొంతకాలంగా ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా తరఫున ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ నితీశ్ రాణా.. ఓపెనర్‌గా తన వంతు విజయాలు అందిస్తున్నాడు. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. జులైలో మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో శ్రీలంకతో భారత్ మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవలే ధ్రువీకరించారు. లంక పర్యటనకు తాను ఎంపికవుతానని నితీశ్ రాణా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా నితీశ్ రాణా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసే జట్టులో నాకు స్థానం దక్కుతుందని నా అంతరాత్మ పదేపదే చెబుతోంది. కాబట్టి ఆ పర్యటనకు సిద్ధంగా ఉన్నా. అవసరమైతే మీరు గత మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో నా రికార్డులను ఓసారి పరిశీలించండి. అది దేశవాళీ టోర్నీ అయినా.. ఐపీఎల్ అయినా నేను మంచి ప్రదర్శన కనబరిచా. దానికి ప్రతిఫలమే త్వరలో దక్కుతుందని భావిస్తున్నా. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. ఆ పిలుపునకు ఒక్క అడుగు దూరంలో ఉన్నానని అందరూ అంటున్నారు. ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు.
							previous post
						
						
					
							next post
						
						
					

