telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కర్ణాటకలో ‘త్రీ ఇడియట్స్” సినిమా తరహాలో కాన్పు… తల్లీబిడ్డ సురక్షితం

Karnataka

మనదేశంలో ఇప్పటికి గర్భిణుల ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. అందుబాటులో ఆస్పత్రులు లేకపోవడం, సరైన రోడ్లు లేకపోవడం, ఏ అర్ధరాత్రో అపరాత్రో అత్యవసర సమయంలో కాన్పు నొప్పులు వచ్చి సమయానికి వైద్యం అందక మాత శిశు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కర్ణాటకలో ఆదివారం ఓ గర్భిణికి ఇలాగే ప్రసవనొప్పులు రాగా ‘ త్రీ ఇడియట్స్ ‘ సినిమాలో లాగా వీడియో కాల్ ద్వారా డాక్టర్ సలహాలు పాటిస్తూ కాన్పు చేసి తల్లీబిడ్డను కాపాడారు.

హుబ్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే హనగల్‌ అనే ఊళ్లో వాసవి అనే మహిళకు చెప్పిన తేదీ కంటే ముందే పురిటి నొప్పులు మొదలయ్యాయి.సహాయం కోసం తక్షణం ఇరుగుపొరుగు స్త్రీలు చేరే సమయానికి ఇంచుమించు ప్రసవం జరిగిపోయే పరిస్థితి ఉంది. భర్త అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే కరోనా హడావుడి వల్ల రావడానికి 45 నిమిషాలు పడుతుందని చెప్పారు. అంత వరకూ ఆగే సమయం లేదని సహాయానికి వచ్చిన మహిళలకు అర్థమైంది. వారిలోని ఒకామె తనకు తెలిసిన ప్రియాంక అనే డాక్టరుకు వాట్సప్‌ కాల్‌ చేసింది. ప్రియాంకది ఆ ఊరే. హుబ్లీ కిమ్స్‌లో గైనకాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. కాన్పు అత్యవసర పరిస్థితిని గ్రహించిన ప్రియాంక ‘నేను వీడియో కాల్‌ ద్వారా మిమ్మల్ని గైడ్‌ చేస్తాను. మీరు కాన్పు చేసేయండి’ అని చెప్పింది.

మహిళలు ఆమె ఉన్నదన్న ధైర్యంతో ప్రసవం చేయడానికి ముందుకొచ్చారు. ‘నేను వారికి చెప్పింది ఒక్కటే బొడ్డుతాడు ఎలా జాగ్రత్తగా కట్‌ చేయాలన్నదే’ అని చెప్పింది డాక్టర్‌ ప్రియాంక. మహిళలు ప్రియాంక సూచనల ప్రకారం కాన్పు చేయడం, బిడ్డను శుభ్రం చేసి పొడిబట్టలో చుట్టడం, పాలకు తల్లి ఎద దగ్గర పడుకో బెట్టడం చేసే సమయానికి అంబులెన్స్‌ వచ్చి తల్లి బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ‘తల్లిబిడ్డను సురక్షితంగా ఉండటంతో మాకెంతో సంతోషంగా ఉంది’ అని కాన్పు చేసిన స్త్రీలు చెప్పారు. డాక్టర్ సలహాలు పాటిస్తూ దైర్యంగా కాన్పు చేసిన మహిళలను అందరూ ప్రశంసిస్తున్నారు.

Related posts