telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

పంతం నెగ్గించుకున్న తెరాస .. ఎమ్మెల్సీ ఏకగ్రీవం..

naveen kumar as Unanimous mlc from trs

టీఆర్‌ఎస్ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌కుమార్ ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఒకే ఒక్క నామినేషన్ మిగలడంతో నవీన్ ఎన్నిక లాంఛనమైంది. ఈ మేరకు ఎన్నికల రిట్నరింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు శుక్రవారం నవీన్‌కుమార్‌కు ధ్రువపత్రం అందజేశారు. అనంతరం నవీన్‌కుమార్ సహా మంత్రులు, టీఆర్‌ఎస్ నాయకులు గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో తనకు అవకాశం కల్పించిన సీఎం కే చంద్రశేఖర్‌రావుకు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు నవీన్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

నవీన్‌కుమార్‌ను కేటీఆర్ అభినందించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పని చేస్తానని నవీన్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ముందుంటానని చెప్పారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించినవారిలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్‌కుమార్‌ను పలువురు పార్టీ నాయకులు అభినందించారు.

Related posts