తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు.
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ముఖ్యమంత్రిగా నేటితో (అక్టోబరు 10) 15 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతల జాబితాలో దక్షిణాది నుంచి ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా ఆయన నిలిచారు.
ఇంతకుముందు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా చంద్రబాబు పేరు మీదే ఉంది. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 8 సంవత్సరాల 255 రోజులు సీఎంగా సేవలు అందించారు.
ఇక, నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు 6 సంవత్సరాల 110 రోజులు పూర్తి చేసుకున్నారు.
మొత్తంగా 15 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగి, ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఈకే నయనార్ వంటి ప్రముఖ నేతలను సైతం అధిగమించారు.
హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చడంలో భాగంగా హైటెక్ సిటీకి పునాది వేయడం, విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి.
2004లో ఓటమి తర్వాత పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని కాపాడుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా గెలిచారు.
ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి, తీవ్ర నిర్బంధ పరిస్థితులు, అరెస్టు వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి, 2024లో కూటమితో కలిసి ఘన విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.