telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి మృతి..

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పీ లహరి ఇకలేరు. 70 ఏళ్ళ ఈ సంగీత దర్శకుడు అనారోగ్యంతో ఈరోజు ఉద‌యం ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

ఇటీవలే లతా మంగేష్కర్ ను పోగొట్టుకున్న బాలీవుడ్ మరో సంగీత దిగ్గజాన్ని కోల్పోవడంతో విషాదంలో మునిగిపోయింది. బప్పీ లహరి మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో పాటలను కంపోజ్ చేసి.. పాడి తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్నారు బప్పీ లహరి. బప్పి లహిరి మొదటి సూపర్ హిట్ చిత్రం అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ నటించిన జఖ్మీ సినిమా.

ఆ త‌రువాత‌ 1970-80 చివరలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి అనేక చిత్రాలలో సూపర్ పాటలను అందించారు. 2020లో శ్రద్దా కపూర్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బాఘీ 3లో భంకాస్ పాట చివరిగా ఆలపించారు.

తెలుగులో సింహాసనం, స్టేట్‌ రౌడీ, సామ్రాట్‌, గ్యాంగ్‌ లీడర్‌, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో చివరగా రవితేజ “డిస్కో రాజా” సినిమాలోని “ఫ్రీక్ అవుట్” పాటలను పాడారు.

1952 నవంబర్ 27న కోల్‌కతాలో జన్మించిన బప్పి లాహిరి తన విభిన్న శైలి కారణంగా చిత్ర పరిశ్రమలో విభిన్నమైన గుర్తింపును తెచ్చుకున్నారు. నిత్యం బంగారు ఆభరణాలతో ఉండే సంగీత విద్వాంసుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో హిట్ పాటలు పాడారు.

అందులో వార్దత్, డిస్కో డాన్సర్, నమక్ హలాల్, డ్యాన్స్ డ్యాన్స్, కమాండో, సాహెబ్, గ్యాంగ్ లీడర్, సైలాబ్, షరాబి వంటి హిట్ సాంగ్స్‌ను అందించి సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. తాహిర్ హుస్సేన్ చిత్రం ‘జఖ్మీ’ (1975)తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ఆ తరువాత ఆయన ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మారాడు.

ఇక సంగీత దిగ్గజాలు మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, విజయ్ బెనెడిక్ట్, షారన్ ప్రభాకర్, అలీషా చినాయ్, ఉషా ఉతుప్ వంటి తరతరాల గాయకులతో కలిసి చేశాడు. గతేడాది కరోనా సోకడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి చికిత్స తీసుకుంటున్నారు.ఈరోజు తుదిశ్వాస విడిచారు.

Related posts