telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గౌతమ్ సవాంగ్‌ను ఎందుకు త‌ప్పించారో ప్రజలకు చెప్పండి..లేకుంటే

గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని జ‌న‌జేన అధినేత‌ పవన్ క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు. చెప్పకపోతే ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే డీజీపీని బదిలీ చేశారని భావించాల్సి వస్తుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందంటూ పవన్ ప్రకటనను విడుదల చేశారు.

అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు.. కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో? ఇందుకుగల కారణాలను ప్రజలకు తెలియజెప్పాలని పవన్ సూచించారు.

లేని పక్షంలో – విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని పవన్ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి.. అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుందంటూ పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు

Related posts