పేదకుటుంబాల్లో ఆనందం నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఉద్ధేశమని తెలంగాణ ఐటీ ,పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేటలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇళ్ల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్ కోరారు.
ఎవ్వరికీ పైసాకూడా ఇవ్వొద్దని కోరారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సమక్షంలో పేదోళ్లందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తాయని భరోసా కల్పించారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా కేసీఆర్ తెలంగాణలో ఇల్లు కట్టివ్వడం, పేదింటి యువతలకు పెళ్లి చేసి అత్తింటికి పంపే బాధ్యతను తీసుకున్నారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదోడి ఆత్మగౌరవాన్ని కాపాడేవిధంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించివ్వాలని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదోళ్ల కళ్లల్లో ఆనందమే టీఆర్ఎస్ సర్కారుకు ఆశీర్వచనాలని పేర్కొన్నారు. బన్సీలాల్ పేట పరిసరాల్లోనూ, సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదోడికి న్యాయంచేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రతికుటుంబానికి న్యాయంచేయాలన్నదే తమ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. బయటివారికి ఎవ్వరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇచ్చేది లేదని ఆయన స్పష్టంచేశారు.