telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణకు చల్లని కబురు తెలిపిన వాతావరణ శాఖ

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ తెలిపింది.

ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 9 వరకు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ వర్షాల వల్ల గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుందని వివరించింది. హైదరాబాద్లో కూడా ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆదివారం సాయంత్రం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు, చెట్లు నేల కూలాయి.

సూర్యాపేట, జనగామ జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయాయి.

తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్డిపిఎస్) ప్రకారం శనివారం రాష్ట్రంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత జగిత్యాల జిల్లాలో 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది.

ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూరులో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

జగిత్యాల జిల్లా గోధూరులో 46.8, అల్లీపూర్లో 46.7, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

హైదరాబాద్లో అత్యధికంగా ఖైరతాబాద్లో 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

జగిత్యాలతోపాటు కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, నారాయణపేట, నిజామాబాద్, మంచిర్యాలలో 46 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Related posts