ప్రతి ఏటా కేంద్ర క్రీడా శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు.. వారి ప్రతిభను తీర్చిదిద్దే కోచ్‌లను ప్రోత్సహిస్తూ పురస్కారాలను అందిస్తుంది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజున భారత క్రీడా దినోత్సవం జరుపుకొంటాం. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఆగస్టు 29న క్రీడా శాఖ రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, ధ్యాన్‌చంద్, అర్జున, ద్రోణాచార్య అవార్డులను అందిస్తుంది. ఈ అవార్డు గ్రహీతలను నిర్ణయించేందుకు క్రీడా శాఖ ఈ సారి 12 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ మేరీకోమ్, ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా కూడా ఉన్నారు.
ఈ ఏడాది అవార్డుల గ్రహీతలను ఒకే కమిటీ నిర్ణయించనుంది. ఎక్కువ కమిటీలు ఉంటే వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. కమిటీని ఆలస్యంగా ఎంపిక చేశాం. అయినా అవార్డు గ్రహీతలను ఎంపిక చేయడానికి మాకు ఇంకా సమయం ఉంది.. అని క్రీడాశాఖ తెలిపింది. కమిటీలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ముకుండకం శర్మ, స్పోర్ట్స్ సెక్రటరీ శ్యామ్ జులానియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ సీఈవో రాజేశ్ రాజగోపాలన్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, మాజీ లాంగ్ జంపర్ అంజు బాబీ, టేబుల్ టెన్నిస్ కోచ్ కమలేష్ మెహతా, మీడియా ప్రతినిధులు రాజేష్ కల్రా, చారు శర్మ ఉన్నారు.