మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ తన సహచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఐదు రాష్ట్రాల్లో రూ. కోటి రివార్డు ఉన్న అనంత్, మరో 10 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
జనవరి 1న లొంగిపోతామని లేఖ విడుదల చేసిన 24 గంటలు గడవకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లొంగిపోయే ముందు అనంత్ ఒక లేఖతో పాటు వరుస ఆడియో సందేశాలను విడుదల చేశారు.
మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల మధ్య పనిచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
“ఇది లొంగిపోవడం కాదు, విప్లవానికి ద్రోహం చేయడం అంతకన్నా కాదు. ప్రజల సమస్యలను మరో రూపంలో ముందుకు తీసుకెళ్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

