telugu navyamedia
విద్యా వార్తలు సాంకేతిక

మనిషికీ, సత్యానికీ ఉన్న బంధమే సైన్సు: గ్రాంసి

విషయమేదైనా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి – అని చెపుతారు. సమాజమే విభజింపబడి ఉంది. ఆర్థిక బలవంతులు, నిరుపేదలు, పెట్టుబడిదారులు, శ్రమజీవులైన వర్కర్లు, ప్రజాపక్షం వహించేవారు, ప్రభుత్వాలకు భజనచేసేవారు, ప్రగతిశీల భావాలు గలవారు, ప్రగతి నిరోధకులు, వైజ్ఞానిక స్పృహగలవారు-లేనివారు, మనుస్మృతి ప్రకారం ఉన్నతులు, నిమ్నవర్గాలు, పుణ్యాత్ములు, పాపాత్ములు, వివిధ మతాలు, అందులో శాఖలు వగైరావగైరా. అలాంటప్పుడు విషయం ఏదైనా అందరికీ ఆమోదయోగ్యమైందిగా ఎలా ఉంటుందో నాకు అర్థమయ్యేది కాదు. మానసిక ఘర్షణలో సతమతమవుతూ ఉండేవాణ్ణి. అలాంటి సందర్భంలో నాకు ఇటలీ మార్క్సిస్టు మేధావి, రచయిత, జర్నలిస్టు, భాషాశాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు గ్రాంసి చెప్పిన మాట గొప్ప ఊరటనిచ్చింది. ‘‘జీవించి ఉన్నామంటే, ఏదో పక్షం వహించాలి. నిజంగా జీవించి ఉన్నవారు పౌరులుగానూ, పక్షపాతులుగానూ ఉంటారు. తటస్థత, ఉదాసీనత, పరాన్నజీవనం, గతి తప్పడం జీవితం కాదు. అది పలాయన వాదం. అందుకే నాకు తటస్థం అంటే అసహ్యం!!’’- అని అన్నాడాయన. దాంతో నాకు ఒక స్పష్టత వచ్చింది. ఆయన పట్ల ఒక గౌరవభావం ఏర్పడింది. పైగా ఆయన సైన్సు, భాషాశాస్త్రం, సామాజికక అంశాలపై చేసిన లోతైన విశ్లేషణలు నన్ను ఆకర్షించాయి. ఆంటోనియో ఫ్రాన్సిస్కో గ్రాంసి (22 జనవరి 1891-27 ఏప్రిల్ 1937) విజ్ఞానశాస్త్రం గురించి ఏమన్నాడో ఇక్కడ టూకీగా చెప్పుకుందాం.

నిత్యజీవితంలో సైన్సు భాగం కావాలి

యువకుడిగా ఆంటోనియో గ్రాంసి
నిత్యజీవితంలో సైన్సు ఒక భాగం కావాలని గ్రాంసి కోరుకున్నాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికీ, అధ్యయనం చేయడానికీ సైన్సు ఒక మార్గం కావాలన్నాడు. ఊహాత్మకమైన భ్రమల్ని నమ్ముతూ కూర్చోకుండా, ఒక విశాలమైన ప్రాపంచిక దృక్పథాన్ని అలవరుచుకోవడానికి తప్పకుండా సైన్సు ఉపయోగపడుతుందన్నాడు. మతతత్వ భావనతో సైన్సును ఎదుర్కోకూడదని చెప్పాడు. సమాజంలోని అంతర్గత సమస్యలను సైన్సు బయటి నుండే కొన్నింటిని అప్రయత్నంగా నివారిస్తుంది. అందువల్ల మనం, వైజ్ఞానిక విజయాల మీద ఎక్కువగానే ఆధారపడాల్సి ఉంటుంది. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సైన్సు తన ప్రాధాన్యతలు నిర్థారించుకుంటుంది. సమాజంలో అంతర్భాగంగా ఉంటూనే, నిత్యజీవితంలోని విశ్వాసాల విశ్లేషణకు పూనుకుంటుంది. మార్పు కోసం చేయాల్సిన సంఘర్షణల్ని గుర్తు చేస్తూ, ఒక తాత్త్విక భూమికను ఏర్పరుస్తుంది.

చారిత్రక కోణంలో గమనిస్తే ఒక్కోసారి మతాలు సైన్సులోని కొన్నికొన్ని విషయాలను ఆహ్వానిస్తాయి. ఉదాహరణకు క్రైస్తవ చర్చ్- అరబ్బుల గణితాన్ని స్వీకరించింది. మతంతో సఖ్యత కుదిరింది కదా అని, సైన్సు ఎప్పుడూ మతపరమైన మూఢవిశ్వాసాల్ని సమర్థించదు. ఈ చిన్న విషయం అవగతం చేసుకోకుండా కొందరు ‘‘సైన్సు కూడా ఒక మతమే’’- అని తీర్మానిస్తారు. అది వారి విజ్ఞతకు వదిలివేయాల్సిన విషయం. గ్రాంసి బతికి ఉన్న కాలంలో సైన్స్ లో మాటాఫిజిక్స్ కు చాలా ప్రాముఖ్యం ఉండేది. ‘సైన్సులో అన్వేషించగలిగేవి, పరిశోధించగలిగేవి కొన్నే ఉంటాయి. అన్వేషించలేనివి, పరిశోధించలేనివి విడిగా మరికొన్ని కూడా ఉంటాయి’- అని శాస్త్రవేత్త ఎడ్డింగ్టన్ వాదిస్తూ ఉండేవాడు. ఆ వాదనతో గ్రాంసి ఎంతమాత్రమూ ఏకీభవించేవాడు కాదు. సైన్సుకు పరిధులు, ఎల్లలూ ఉండవని-పరిశోధించే శాస్త్రవేత్తకు సరైన సాంకేతిక సామగ్రి లేకనో.. సరైన అనుభవం లేకనో తాత్కాలికంగా అలా అనిపిస్తే అనిపించొచ్చు. కానీ, అది నిజం కాదు- అని అనేవాడు.

ఇంగిత జ్ఞానం

కొన్ని వాస్తవాల్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోగలరు. దాన్నే ‘ఇంగిత జ్ఞానం’ అంటూ ఉంటాం. ఇంతకీ ఇంగిత జ్ఞానాన్ని ఎలా నిర్వచించుకుంటాం? అంటే – మొత్తానికి మొత్తంగా సమాజంలో ఉన్న విశ్వాసాల ఏకత్వం ..మళ్ళీ మళ్ళీ పునరుజ్జీవింపబడడాన్ని – ఇంగిత జ్ఞానం అని అంటాం. ఈ విశ్వాసాలు మతపరంగా, మూఢనమ్మకాలపరంగా, దృక్పథాలపరంగా అలాగే, కొన్ని వైజ్ఞానిక సూత్రాలపరంగా కూడా ఏర్పడొచ్చు. ఇవి చాలా బలంగా ఉంటాయి. వీటినే ‘నిజాలు’ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. వీటిని వైజ్ఞానిక వివరణల్లో లేదా మతవివరణల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఒక్కోసారి, ఒక్కొక్కరి ఇంగిత జ్ఞానం ఒక్కోరకంగా ఉండడం మనం గమనిస్తాం. అయితే ఈ ఇంగిత జ్ఞానమే ‘మంచి స్పృహ’గా రూపాంతరం చెందుతుంది. ఈ మంచి స్పృహ ఏమిటీ? అంటే – ఇది ఆరోగ్యకరమైన స్పృహ. ఇది అంధ విశ్వాసాల మీదగాని, భావోద్రేకాల మీదగానీ ఆధారపడకుండా స్వతంత్రంగా, స్వచ్ఛంగా నిలబడగలిగేది. ఇది అన్యాయమైన కొన్ని సమూహాలను గాని, శ్రామిక వర్గాన్ని గాని, దెబ్బతిని ఉన్న కొందరు వ్యక్తులను గాని…గుర్తించి – వారి మేలు కోసం కృషి చేసేది . వ్యవస్థల్ని పటిష్ఠం చేసేది. వెంటనే చేయలేకపోయినా, ఆ దిశగా పని చేసేది. ఇలాంటి మంచి స్పృహ సమాజానికి ఎప్పుడూ అవసరమే!

సమాజ భాగస్వామ్యం లేకుండా సైన్సు అభివృద్ధి కాదు. సామాజిక సంస్కృతితో పరిచయం లేకుండా, ప్రపంచ పరిజ్ఞానం సంపాదించుకోకుండా అసలు పరిశోధనలు ఎలా జరిగేవి? నూతన ఆవిష్కరణలు ఎలా బయటపడేవి? నిత్య జీవితంలోంచి ఎగిసి పడుతున్న ప్రశ్నల్ని సైన్సు ఎదుర్కోగలగాలి. చారిత్రికంగా గమనిస్తే ప్రతికాలంలోనూ సైన్సుకు కొన్ని కొన్ని పరిధులు, పరిమితులూ ఉంటూనే వచ్చాయి. అవి ఇకముందు రాగల కాలంలో కూడా వేరే విధంగా ఉంటాయి. విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి వైజ్ఞానికి పరికరాలు ఎంతో అవసరం. నిజమే! కాని, అంతకన్నా ముఖ్యమైనవి మేథోపరమైన, తాత్త్వికపరమైన, రాజకీయపరమైన పరికరాలు. పరికరాలు అంటే ఇక్కడ అంశాలు, ఆలోచనలు! వైజ్ఞానికంగా రుజువైన నిజాల్ని ‘సత్యం’గా స్వీకరించలేం. ఎందుకంటే రుజువైన నిజాలు మారిపోయే అవకాశం ఉంది. సైన్సు నిరంతరం మారుతూ ఉంటుంది. కానీ, సత్యం అనేది మారకుండా ఉండాలి కదా? అందుకే అసంపూర్ణమైన సత్యాలకు సైన్సు జవాబుదారీ కాదు.

సైన్సుకు మనిషి ప్రధానం

మధ్యవయస్కుడుగా గ్రాంసి
సైన్సు సమాజంతో విడివడి ఉంటుందని గ్రాంసి ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే సైన్సు ఉద్దేశం సత్యాన్వేషణే అయినా, దాని తొలి ప్రాధాన్యత మాత్రం మనిషే. సైన్సు దానికదే అభివృద్ధి కాలేదు. మనిషి చొరవతో, అతను కనుగొన్న కొత్తకొత్త పద్ధతులతో, కొత్తకొత్త పరికరాలతో, కొత్తకొత్త సాంకేతిక నిపుణలతో పాటు – అతని ఉత్సుకత, శ్రమల కలయికతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతూ వచ్చింది. అందువల్ల సైన్సు ధ్యేయం ఏమిటీ? – అంటే …సాంకేతికంగా మనిషికీ, సత్యానికీ సత్సంబంధం నెలకొల్పడమే – సైన్సు. మానవజాతిని సైన్సు నుండి విడదీయలేం. ఎందుకంటే మానవజాతి లేనిది సైన్సు లేదు. తత్త్వవేత్తలాగా వైజ్ఞానికుడు కేవలం ఆలోచనాపరుడు మాత్రమే కాదు. ఆలోచన చేయడంతో పాటు అతనొక కష్టజీవి కూడా!

ఇతర రంగాలలో వలెనే వైజ్ఞానిక రంగంలో కూడా వైజ్ఞానికులకు విరోధులుంటారు. విమర్శిస్తుంటారు. అలాంటప్పుడు వాదొపవాదాల్లో సత్య నిర్థారణకు ప్రాధాన్యమివ్వాలే గాని, వాదనలో నెగ్గడం, నెగ్గకపోవడం అనేది అక్కడ ప్రధానం కాకూడదు. విరోధులు చెప్పే విషయాల్లో బలహీనమైన అంశాలు పట్టుకుని వారిపై ఎదురుదాడికి దిగకుండా – వారి వాదనలో సార్వజనీనమైన అంశాలు ఏమున్నాయో గమనించాలి. వాదనల వల్ల భావోద్రేకాలు వెళ్ళగక్కుకోవడం కాకుండా, సమాజానికి కొత్త విషయాలు ఏమి అందించగలుగుతున్నామో బేరీజు వేసుకోవవాలి. చెప్పినా, రాసినా విషయం సరళంగా, మంచి భాషలో, స్థాయి తగ్గించుకోకుండా చూసుకోవాలి. విరోధులలోసైతం ఆలోచనలు రేకెత్తించేట్ల చేయగలగాలి.

కొత్త ద్వారాలు తెరిచిన పారిశ్రామిక యుగం

పారిశ్రామిక యుగం సమాజానికి కొత్త ద్వారాలు తెరిచింది. రకరకాల పనులు చేయగల వర్కర్లు, మేనేజర్లు – వారికి అనుగుణంగా ఉత్పత్తి వ్యవస్త తయారైంది. వీటితోపాటు విద్యకు అనూహ్యంగా ప్రాముఖ్యత పెరిగింది. ఒక రకంగా సైన్సుకు మూలాలు విద్యలోనే ఉన్నాయి. గ్రాంసి కాలానికి రెండు రకాల విద్యావిధానాలు అమలులో ఉండేవి. ఒకటి – ఉన్నత వర్గానికి పనికొచ్చే విద్యావ్యవస్థ. రెండు – ఆర్థికంగా అణగారిన వర్గాలకు పనికొచ్చే తక్కువ స్థాయి విద్యావ్యవస్థ. విద్యావంతుల కుటుంబాల నుండి వచ్చినవారికి ఉన్నత ప్రమాణాలు గల విద్య అందుబాటులో ఉండేది. ఆర్థిక స్థోమతలేని నిరక్షరాస్యుల కుటుంబాల నుండి వచ్చే పిల్లలకు ప్రమాణాలు లేని, అతి తక్కువ స్థాయి విద్య అందుబాటులో ఉండేది. ముఖ్యంగా శారీరకశ్రమ అసవరమయ్యే సాంకేతిక శిక్షణ మత్రామే లభిస్తూ ఉండేది. ఆ పరిస్థితి మారాని గ్రాంసి కలలుగనేవాడు. మనవీయ విలువలు, సాంకేతిక శిక్షణ కలగలిపి తయారు చేసిన విద్యావిధానం అన్ని వర్గాల బాలబాలికలకు సమానంగా అందాలని గ్రాంసి అభిలషించేవాడు.

ఆంటోనియో ఫ్రాన్సిస్కో గ్రాంసి, ఫాసిస్ట్ ముస్సోలిని కాలంలో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. రచయితగా ఆయన ఆ కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. చరిత్ర, మార్క్సిస్టు తాత్త్వకత, సామాజిక శాస్త్రాలపై అనేక రచనలు చేశాడు. వాటిని మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. 1. జైలుకు వెళ్ళకముందు రచనలు. 2. జైలులో రాసిన ముప్పయి ప్రిజన్ నోట్ బుక్స్. ఈ ప్రిజన్ నోట్ బుక్స్ అత్యంత ఉన్నత ప్రమాణాలుగల రాజకీయ సిద్ధాంతాలని ప్రపంచం గుర్తించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబంలో పుట్టిన గ్రాంసి బాల్యంలో ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. పాట్ వ్యాధి వల్ల వెన్నుపూస పెరగకపోవడం, దాని వల్ల శారీరక ఎదుగుదల లేకపోవడం జరిగాయి. అవరోధాలను అధిగమించి, ఒక గొప్ప దార్శనికుడిగా ఎదగగలగడం మామూలు విషయంకాదు. తల్లిదండ్రులు అన్నీ అమర్చినా, శారీకరంగా దృఢంగా ఉన్నా – సరైన దృక్పథం ఏర్పరచుకోకుండా ఉన్న నేటితరం యువవీయువకులు తప్పకుండా గ్రాంసి జీవితం నుండి ఎంతో నేర్చుకోవాలి. ఆయన ఆలోచనలతో స్ఫూర్తిని పొందాలి. సామాజిక స్పృహ, వైజ్ఞానిక స్పృహ గల వాళ్ళను గ్రాంసి తప్పకుండా పలకరిస్తాడు.

Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related posts