telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కర్ణాటక సంగీత కారుడు మంగళంపల్లితో మధురానుభవం

శనివారం మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90 జయంతి. ఆధునిక కర్ణాటక సంగీతంలో తిరుగులేని గాయకుడు, సుమధుర సంగీత దర్శకుడు, సరికొత్త రాగాల సృష్టికర్త. గాన గంధర్వుడు, నాద మహర్షి, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ .
సంగీత రంగంలో మహనీయ కళాకారుడు బాలమురళీకృష్ణ గారితో నాకు మర్చిపోలేని మాధురానుభూతి.
1996 నాటి సంగతి. ఆ సంవత్సరం మిత్రులు అంజిరెడ్డి, ప్రసాద్ రెడ్డి తో కలసి “ప్రియమైన శ్రీవారు” అనే చిత్రం నిర్మించాము. ఇందులో సుమన్, ఆమని, సంఘవి, రవళి నటించారు. దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ను. నిర్మాణ భాద్యతలు నేనే చూశాను. ఈ సినిమాలో వేటూరి సుందర రామ్మూర్తి గారు రాసిన ఒక పాటను బాలమురళిగారితో పాడించాము. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్. వేటూరి గారు తన పాటను బాలమురళీకృష్ణ గారితో పాడించాలని నాతో చెప్పారు. బాలమురళి కృష్ణ గారు 1983లో దాసరి గారి “మేఘ సందేశం” సినిమా తరువాత తెలుగు సినిమా పాట పాడలేదు. అప్పటికి 13 సంవత్సరాలు అవుతుంది. పాడతారో లేదో అనే సందేహం వుంది.
వందేమాతరంతో ఈ విషయం చెప్పాను. “గురూజీ ఎలాగైనా పాడిద్దాం, మీరు ప్రయత్నం చెయ్యండి” అన్నాడు.
నిజానికి నాకు బాల మురళిగారితో పరిచయం లేదు. అప్పుడు నాతో “నేను కూడా వస్త్తాను, వారిని కలసి రిక్వెస్ట్ చేద్దాం” అన్నారు వేటూరిగారు.

Priyamaina
అప్పుడు బాలమురళి కృష్ణ గారితో ఫోన్లో మాట్లాడితే “సాయంత్రం రండి” అని ఆహ్వానించారు.
వేటూరి సుందర రామ్మూర్తి, వందేమాతరం, ప్రసాద్ రెడ్డి, నేను సాయంత్రం ఆరు గంటలకు బాలమురళి గారి ఇంటికి బయలుదేరాము.
దారిలో వర్షం మొదలైంది. క్రమంగా జడివానగా మారింది. అప్పటికి ఓ గంట ఆలస్యంగా ఏడు గంటలకు వెళ్ళాము.
బాలమురళి కృష్ణ గారి వీధిలో నీళ్లు బాగా నిలిచాయి. ఆ నీళ్లలో అలాగే దిగి లోపలకు వెళ్ళాము.
మేడ మీద మా కోసం బాలమురళి ఎదురు చూస్తున్నారు.
వేటూరిగారు అప్పటికే పరిచయం. మమ్మలిని బాలమురళి గారికి పరిచయం చేశారు.
మాకు తుడుచుకోవడానికి టవల్స్ తెప్పించారు. కాసేపటికే వేడి వేడి కాఫీ వచ్చింది.
మేము వచ్చిన విషయం చెప్పాను… “తెలుగు సినిమాలకు పాడటం లేదు… ఇప్పుడొచ్చే పాటలు పాడాలని లేదు” అన్నారు.
అప్పుడు నేను “వేటూరిగారు వ్రాసిన పాట.. జీవితానికి దగ్గరగా వున్నా గొప్ప పాట… మీరైతేనే ఆ పాత బాగుంటుందని… ” బాలమురళి వేటూరి వైపు చూశారు . వేటూరి నమస్కారం చేశాడు. “వందేమాతరం శ్రీనివాస్ .. యువ సంగీత దర్శకుడు ..,. మంచి ట్యూన్ చేశారు … ” అన్నాను.
వందేమాతరం వైపు చూశారు. మేము ఒకవైపు సోఫాలో కూర్చున్నాము. మాకు ఎదురుగా బాలమురళి గారు దివాన్ మీద కూర్చున్నారు. శ్రీనివాస్ వెళ్లి బాలమురళి గారు కూర్చున్న చోటకు వెళ్లి క్రింద కూర్చోబోయాడు. బాలమురళి శ్రీనివాస్ చేయి పట్టుకొని తన ప్రక్కన కూర్చున్నాడు.
“ఏది శ్రీనివాస్ .. ఓ సారి పాట వినిపించు” అన్నారు. మా అందరిలో ఆశ కలిగింది.
అప్పుడు శ్రీనివాస్ “జాతకాలు కలిసేవేళ .. జీవితాలు ముగిశాయి” అంటూ పాడి వినిపించారు.
వందేమాతరం స్వతహాగా గాయకుడు కావడంతో.. ఆ పాటను చాలా బాగా పాడి విని పించారు.
బాలమురళి కృష్ణ చాలా గంభీరంగా మారిపోయాడు. అంతలో తేరుకొని కుర్రోడిని పిలిచి మారోమారు కాఫీ తీసుకురమ్మని చెప్పాడు.
“శ్రీనివాస్ మరో సారి పాడు” అన్నారు బాలమురళి.
శ్రీనివాస్ ఈసారి మరింత బాగా పాడారు. ఈ పాట మసుల్ని కదిలించే గొప్ప విషాద గీతం.
బాలమురళి కృష్ణ గారు శ్రీనివాస్ భుజం తట్టి వేటూరివైపు చూస్తూ “నేను పాడతాను” అన్నారు.
ఆ తరువాత రోజు చెన్నయ్ విజయ గార్డెన్ లోని రికార్డింగ్ థియేటర్ కు వచ్చి అద్భుతంగా గానం చేశారు.
13 సంవత్సరాల తరువాత బాలమురళి గానం చేసిన పాట.
విశేషమేమిటంటే “ప్రియమైన శ్రీవారు” సినిమాలో ఈ పాటను ప్రేక్షకులు అమితంగా మెచ్చుకున్నారు.
బాలమురళి పాడిన చివరి తెలుగు పాట ఇదే.

-భగీరథ

Related posts