telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

మనది కానిది

vijayam poetry corner

నడకలు గుడులైతే
మార్గాలు బానిసలైతయి
ఆశయాలు అగ్గిలో బూడిదలైతయి
మనిషెప్పుడు మనిషిగా నిలువలే నిలువనియ్యలే
గాలినెప్పుడూ గాలిగా గుర్తించలే గుర్తించనీయలే
నిప్పును కనిపెట్టిన మేదస్సు
అజ్ఞానం ముందు తలవొంచుతున్నది
నిప్పేమో పరమ పూజలందుకుంటున్నది
రాయిని దేవునిగా తొలిచిన శిల్పి
మైలతో వెలేయబడుతున్నడు
రాయేమో పూజలందుకొనీ
ముప్పూటలా పాయసాన్ని సేవిస్తున్నది
మనది కానిది
రూపం లేనిది రాజ్యమేలుతున్నది
నిజమెప్పుడూ పరాయిదౌతున్నది
సైన్స్ ఎంత కండ్లు తెరిచినా
భూత గద్దెలో గుడ్లు తేలేస్తున్నది
విజ్ఞాన శాస్త్రం నింగికెగిరినా
ప్రతిభ అశాస్త్రియంలో ముక్కు మూసుకొని మునుగులేస్తున్నది
అబద్ధం అంతటా అద్దమైతున్నది ఆత్మగౌరవమైతున్నది
సత్యం రెక్కలు తెగిన పక్షై
తన గూడును వెతుకుతున్నది
రెప్పలు గొట్టకుండా కలలు కంటున్నరు
భ్రమల్లో ఉహాలు ఊయలలై ఊగుతున్నవి
ఓ మానవా..!
నీకు నీవే బలాదూర్..జయ జయహో

వనపట్ల సుబ్బయ్య

Related posts