telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి – మచిలీపట్నంలో మంత్రి నారా లోకేష్ పిలుపు”

ప్రజలు మనపై బాధ్యత పెట్టారని, కష్టపడి ప్రజాసమస్యలు పరిష్కరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం అంటే తెలగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. ఇక్కడ ఎప్పుడైతే గెలిచామో అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించాం. మంత్రి కొల్లు రవీంద్రపై గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా టీడీపీ కోసం, చంద్రబాబునాయుడు గారికోసం నిలబడ్డారు. మచిలీపట్నంలో అక్రమ కేసులతో ఎంత వేధించినా పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయాన్ని సాధించి పెట్టిన కార్యకర్తలకు నమస్కారాలు.

పార్టీ నేతలు కష్టకాలాన్ని మర్చిపోకూడదు

నేను ఈ రోజు మచిలీపట్నం వస్తుంటే అడుగడుగునా పోలీసులు ఉన్నారు. మనపై అక్రమ కేసులు పెట్టిన వారే మనకు సెల్యూట్ కొట్టారంటే అదీ ప్రజాస్వామ్య గొప్పదనం. చంద్రబాబు గారి మొండిధైర్యం మామూలుది కాదు. 1996లో రాజమండ్రి సెంట్రల్ జైలును ఆధునీకరించిన వ్యక్తి. 2014-19 మధ్య చంద్రబాబు గారు కట్టిన బ్లాక్ లోనే ఆయనను అక్రమంగా నిర్బంధించారు. జైలు నుంచి చంద్రబాబునాయుడు గారు పులిలా బయటకు వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు మనకు సెల్యూట్ లు కొడతారు. పార్టీ నేతలు కష్టకాలాన్ని మర్చిపోకూడదు. పార్టీ కోసం కంటిచూపు పోగొట్టుకున్న చెన్నుపాటి గాంధీ, మంజులారెడ్డి, అంజిరెడ్డి తాత, తోట చంద్రయ్యలే మనకు ఆదర్శనం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలా వ్యవహరించాలి. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం. అంతర్గతంగా పోరాడాలి. జగన్ రెడ్డిపై కంటే మూడు రెట్లు ఎక్కువగా పార్టీలో పోరాడా. పార్టీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కట్టుబడి ఉండాలి.

ఈ ఏడాది నిరుద్యోగ భృతి అందిస్తాం

దేశంలో ఏ పార్టీకి రానివిధంగా 94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలకు మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకోవాలి. మెగా డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం. పెద్దఎత్తున కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది నిరుద్యోగ భృతి మొదలుపెడుతున్నాం. భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. వారిని గౌరవించాలనేది టీడీపీ నినాదం. మహిళలను గౌరవించాలనేది ముందు మన ఇంట్లో మొదలవ్వాలి. 50శాతం పనులు మగవారు, 50శాతం పనులు ఆడవారు చేయాలని పాఠ్యాంశాల్లో పెట్టాం. జులై 5న మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ లో తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు అందించాం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సబ్సీడీ మొత్తాన్ని మహిళల అకౌంట్లలో జమచేస్తాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, దివ్యాంగ పెన్షన్ రూ.6వేలు, పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్ అందిస్తున్నాం.

కూటమి ప్రభుత్వ అభివృద్ధిని జులై 2 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లాలి

కూటమి ప్రభుత్వ అభివృద్ధిని గడపగడపకు తీసుకెళ్లాలి. జులై 2 నుంచి సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా డోర్ టూ డోర్ ప్రచారం చేయాలి. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తాం. ఇకపై ప్రతి ఒక్కరు నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలి. కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నేను అది చూసుకుని వెళ్లకుండా ముందుగా కార్యకర్తలతో సమావేశం అయ్యాను. ఇకపై నేతలందరూ నియోజకవర్గ పర్యటనల్లో కార్యకర్తలతో భేటీ కావాలి.

వైసీపీ నేతలు ఇప్పటికీ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు

వైసీపీ నేతలు ఇప్పటికీ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేత ఇప్పటికీ ప్రజలను కలుసుకోవడం లేదు. కార్యకర్తలను కలవడం లేదు. రెడ్ బుక్ పేరు చెబితేనే ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరికి బాత్ రూమ్ లో జారి చేయి విరిగింది. మేం చట్టప్రకారం ముందుకు వెళ్తున్నాం. పార్టీ నేతలు, కార్యకర్తలకు అహంకారం వద్దు. సౌమ్యంగా ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రజలు మనపై బాధ్యత పెట్టారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. కష్టపడి ప్రజల సమస్యలను పరిష్కరించాలి.

ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది

ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. కేంద్ర సహకారం వల్లే మనం ముందుకు వెళ్లగలుగుతున్నాం. ఏపీ అన్ని కోరికలను ప్రధాని నరేంద్ర మోదీ గారు తీరుస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో 3 లక్షల మంది యోగసనాలతో గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించి మోదీ గారికి కానుకగా ఇచ్చాం. కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయి. కూటని బలోపేతం చేద్దాం. ప్రభుత్వం, పార్టీ జోడెద్దుల బండి. రెండింటినీ నడిపేందుకు కష్టపడి పనిచేస్తున్నామన్నారు. మాటల్లో కాకుండా చేతల్లో కార్యకర్తలను గౌరవిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, జోనల్ ఇంఛార్జ్ మంతెన సత్యనారాయణ రాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, నియోజకవర్గ పరిశీలకులు ఎల్. సాయిరాం ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts