telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్ గా లావు శ్రీకృష్ణదేవరాయలు

టీడీపీ ఎంపీ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలుకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా లావు శ్రీకృష్ణదేవరాయలును కేంద్రం నియమించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నియామకం పట్ల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో పాటుగా టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా లావు శ్రీకృష్ణదేవరాయలు  ఏపీకి సంబంధించిన ఆహార ధాన్యాల సేకరణతో పాటు ఆహార ధాన్యాల నిల్వ, పంపిణీ వంటి అంశాలను చూసే ఎఫ్‌సీఐ కమిటీకి నేతృత్వం వహిస్తారు.

ఎఫ్‌సీఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, పరిస్థితులను సమీక్షించనున్నారు. అలాగే ధాన్యం సేకరణ ప్రక్రియ, ఇతర పంట ఉత్పత్తుల సేకరణతో పాటుగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల అమలవుతున్న తీరును పర్యవేక్షిస్తారు.

అలాగే రాష్ట్రంలో ఆహార భద్రతకు సంబంధించి కేంద్రానికి సూచనలు, సిఫార్సులు అందిస్తారు.

కేంద్ర ప్రభుత్వం తనకు ఈ కొత్త బాధ్యతలు అప్పగించడంపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు తెలియజేశారు.

కేంద్రం తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు కేంద్రానికి, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమానికి, ఆహార ధాన్యాల సేకరణలో పారదర్శకతకు కృషి చేస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

 

Related posts